రజనీకి భలే విలన్ దొరికాడులే..

0సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో విలన్ పాత్ర అంటే మామూలు విషయం కాదు. శిఖర స్థాయి ఇమేజ్ ఉన్న రజనీ ముందు అందరూ విలన్ గా సరిపోరు. ఆ నటుడికి ఒక స్టేచర్ ఉండాలి. రజినీ కొత్త సినిమా ‘కాలా’లో నానా పటేకర్ లాంటి ఉద్ధండ నటుడు విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక శంకర్ దర్శకత్వంలో రజినీ నటించిన ‘2.0’లో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రజనీ త్వరలోనే మొదలుపెట్టబోయే కొత్త సినిమాకు కూడా విలన్ గా భలే నటుడిని ఎంచుకన్నట్లు సమాచారం. ‘పిజ్జా’.. ‘జిగర్ తండా’.. ‘ఇరైవి’ లాంటి వైవిధ్యమైన సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించిన కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

ఇందులో రజనీకి విలన్ గా విజయ్ సేతుపతి నటించనున్నట్లు సమాచారం. నటుడిగా విజయ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గత ఆరేడేళ్లలో అతను అద్భుతమైన పాత్రలు చేశాడు. తమిళంలో గొప్ప నటుడిగా కీర్తి సంపాదించాడు. అతడికి జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. గత ఏడాది మాధవన్ తో కలిసి విజయ్ చేసిన ‘విక్రమ్ వేద’లో వేద పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. అది నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టరే. కెరీర్ ఆరంభంలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలే చేశాడు. తర్వాత కార్తీక్ తీసిన ‘పిజ్జా’తో హీరోగా మారాడు. ఇప్పుడు మళ్లీ రజనీ కోసం తన మిత్రుడిని విలన్ గా మారుస్తున్నాడు కార్తీక్. రజనీ-విజయ్ సేతుపతి కాంబో అనగానే ఈ ప్రాజెక్టుపై ఉన్న ఆసక్తి రెట్టింపు అయిపోయింది. మరి సినిమాలో వీళ్లిద్దరూ ఎలా ఢీకొంటారో చూడాలి. ఇంకో రెండు నెలల్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. వచ్చే ఏడాది వేసవికి విడుదల చేస్తారు.