రూరల్ అంటే రికార్డు బ్రేకింగులే!

0పల్లెటూళ్లకు ఎంత సత్తా ఉందో ఈ తరం సిటీ జనాలకు అంతగా తెలియదు. గ్రామాల్లో అలా.. పల్లెటూళ్లలో ఇలా అని వినడమే తప్ప.. అనుభవించిన వారు యంగర్ జనరేషన్ చాలా తక్కువగా ఉంటున్నారు. అందుకే ఫిలిం మేకర్స్ కూడా.. పల్లెటూళ్లను చూపించి కాసులు కొల్లగొట్టే ప్రోగ్రామ్ లో బాగా సక్సెస్ అవుతున్నారు.

కొన్నేళ్ల క్రితం అర్బన్ సెంట్రిక్ మూవీస్ అంటే అదో ట్రెండ్ గా ఉండేది. కానీ ఇప్పుడు మళ్లీ తమకు తెలియని పల్లెటూళ్ల నేపథ్యాన్ని చూసేందుకు ఇష్టపడుతున్నారని.. రీసెంట్ ఫిలిమ్స్ చూస్తే అర్ధమవుతుంది. అఫ్ కోర్స్.. అలాగని ఏవి పడితే అవి ఆడేయవు లెండి. ఆ థీమ్ కి తగిన క్యాస్టింగ్.. అంతకు మించి కథ.. దీంతో పాటు అట్రాక్టివ్ నెరేషన్ ఉండాల్సిందే. రామ్ చరణ్ రీసెంట్ మూవీ రంగస్థలం.. బోలెడన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ఇది పల్లెటూరి నేపథ్యం మాత్రమే కాదు.. ఆడియన్స్ ను ఓ 30 ఏళ్ల వెనక్కు తీసుకెళ్లిన సినిమా.

నాగార్జున కెరీర్ బెస్ట్ మూవీ సోగ్గాడే చిన్ని నాయన కూడా పూర్తిగా గ్రామీణ నేపథ్యంతోనే సాగుతుంది. మొదలుపెట్టడం విదేశాల్లో అయినా.. ఒక్కసారి విలేజ్ కు వచ్చిన తర్వాత మళ్లీ సిటీ వైపే చూడదు ఈ సినిమా. శర్వానంద్- అనుపమ నటించిన శతమానం భవతి కూడా అంతే. విదేశాల నుంచి తమ సొంతూరికి ఓ పండుగకి వచ్చిన కుటుంబం.. వారి అనుబంధాలు.. సింపుల్ గా చెప్పుకుంటే సినిమా అంతే.

ఫిదా అంటూ వరుణ్ తేజ్- సాయిపల్లవిలతో శేఖర్ కమ్ముల తీసిన ఫిదా చిత్రం కూడా విలేజ్ బ్యాక్ గ్రౌండ్ తోనే సాగుతుంది. అయితే.. సగం సినిమా ఫారిన్ లో సాగినా.. సినిమాకు ఆయువుపట్టు మాత్రం తెలంగాణ గ్రామమే. వెంకటేష్-మహేష్ బాబు అన్నాదమ్ములుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సాధించిన సక్సెస్ గురించి తెలిసిన విషయమే. ఇందులో విలన్స్ అయితే ఉండరు కానీ.. సిటీ జనాల ఆలోచనలను అలానే చూపించినట్లుగా అనిపిస్తుంది. మొత్తానికి పల్లెటూళ్ల నేపథ్యంతో సాగే సినిమాలు టాలీవుడ్ లో తెగ ఆడేస్తున్నాయి. సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాయి.