ఎన్టీఆర్.. ఆ డైలాగ్ ఎందుకు చెప్పాడో

0Viral-Dailogue-Of-NTR-In-Jai-lava-kusaఒకరి గొప్పదనాన్ని వేరొకరు చెప్పాలి. ఎవరికి వాళ్లు తమ గొప్పదనం గురించి చెప్పుకుంటే వినడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇదే చేశాడు. ఎన్టీఆర్ ఎంత మంచి నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ విషయాన్ని ఎవ్వరైనా అంగీకరించాల్సిందే. ఇండస్ట్రీ మొత్తం అతడి నట ప్రతిభను గుర్తించింది. ప్రేక్షకులూ ఆ విషయాన్ని అంగీకరిస్తారు.

ఎన్టీఆర్‌ అంటే ఇష్టపడని వేరే హీరోల అభిమానులు సైతం అతను మంచి నటుడని ఒప్పుకుంటారు. మరి అందరి చేతా ప్రశంసలు అందుకున్న తారక్.. తనకు తాను మహానటుడని కితాబిచ్చుకుంటే ఎలా ఉంటుంది? నేరుగా ఈ విషయాన్ని చెప్పకపోయినప్పటికీ ‘జై లవకుశ’ ట్రైలర్లో ఎన్టీఆర్ నోటి వెంట ఈ మాట వినిపించింది.

ట్రైలర్లో ఒకచోట లవ పాత్రలో ఎన్టీఆర్ ‘‘నేను మహానటుణ్నని ఆడియన్స్‌లో ఒక పాజిటివ్ రియాక్షనుందిరా.. అలాంటి నన్ను మీ ఎదవ పెర్ఫామెన్సులేసేసి ఆడిటర్ ముందు ఇరికించేస్తార్రా’’ అనే డైలాగ్ చెబుతాడు. ఈ డైలాగ్ ఏ సందర్భంలో వస్తుందో.. ఎలా సింక్ అవుతుందో తెలియదు కానీ.. ఈ డైలాగ్ విన్నాక మాత్రం ఎన్టీఆర్ తన గురించి ఇలా గొప్పలు చెప్పుకున్నాడేంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

బయట పాపులర్ ఒపీనియన్స్ కొన్నింటిని స్టార్ హీరోల సినిమాల్లో ఇలా సందర్భానుసారం ఇరికించడం మామూలే. ఎన్టీఆర్ గొప్ప నటుడన్న అభిప్రాయం జనాల్లో ఉన్న మాట వాస్తవమే. మరో పాత్ర ద్వారా ఆ డైలాగ్ చెప్పిస్తే ఓకే కానీ.. ఎన్టీఆర్ తనకు తానుగా చెప్పుకోవడమే ఇబ్బందిగా అనిపించింది. మరి సినిమాలో ఏ సందర్భంలో ఈ డైలాగ్ వస్తుందో.. దాని ఉద్దేశమేంటో చూద్దాం.