విశాల్‌ చిత్రానికి ముహూర్తం ఖరారు

0Vishal-Keerthi-Sureshనటుడు విశాల్‌ నటిస్తున్న తాజా చిత్రం తుప్పరివాలన్‌. మిష్కిన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో విశాల్‌ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఆయన ఇంతకు ముందు లింగుస్వామి దర్శకత్వంలో నటించిన సండైకోళి చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దానికి సీక్వెల్‌ రూపొందనున్నట్లు చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఎట్టకేలకు సండకోళి–2 చిత్ర ప్రారంభానికి ముహూర్తం కుదిరింది.

ఈ నెల 31వ తేదీన చిత్రం ప్రారంభం కానుంది. ఇందులో విశాల్‌కు జంటగా అందాల నటి కీర్తీసురేశ్‌ నటించనున్నారు. మరో కీలక పాత్రలో నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ నటిస్తున్నారు. సండకోళి చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన నటుడు రాజ్‌కిరణ్‌ ఈ చిత్రంలోనూ విశాల్‌కు తండ్రిగా నటించనున్నారు. ఈ చిత్రం కోసం చెన్నైలో మదురైని దించే విధంగా బిన్ని మిల్లులోని 10 ఎకరాల స్థలంలో భారీ సెట్‌ను వేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. అందులో 500 దుకాణాలు, ఒక పెద్ద దేవాలయం చోటు చేసుకుంటాయట.

ఈ సెట్‌లో విశాల్‌ ఇంట్రో సాంగ్‌ను చిత్రీకరించనున్నట్లు, అందులో వెయ్యిమందికి పైగా సహాయ నటులు, నృత్య కళాకారులు పాల్గొంటారని యూనిట్‌ వర్గాలు తెలిపారు. అదే విధంగా చిత్రంలోని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరించడానికి దర్శకుడు లింగుస్వామి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నెల 31న ప్రారంభం కానున్న సండకోళి–2 చిత్రానికి యువన్‌శంకర్‌రాజా సంగీత బాణీలు కడుతున్నారు. దీన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.