పాపం.. సినిమా ఇచ్చేవాళ్లే లేరు

0

వి.వి.వినాయక్.. ఒకప్పటి టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడు. అతడితో సినిమా చేయడానికి హీరోలు పోటీ పడేవాళ్లు. నిర్మాతలు క్యూ కట్టేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తల్లకిందులైపోయింది. వినాయక్ తో సినిమా అంటేనే బాబోయ్ అనేస్తున్నారు. ముఖ్యంగా ‘ఇంటిలిజెంట్’ తర్వాత వినాయక్ పెద్ద కష్టమే ఎదుర్కొంటున్నాడు. ఈ సినిమా చెత్తగా ఉండటం.. ఫలితం కూడా దారుణంగా రావడంతో వినాయక్ మోస్ట్ అన్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు టాలీవుడ్లో. ఐతే ఇలాంటి పరిస్థితుల్లో కూడా వినాయక్ ను నమ్మి ‘ఇంటిలిజెంట్’ నిర్మాత సి.కళ్యాణ్ ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు. నందమూరి బాలకృష్ణతో సినిమా కమిట్ చేయించాడు. కానీ వినాయక్.. బాలయ్యను కథతో మెప్పించలేకపోయాడు. చాలామంది రచయితల సహకారంతో చాలా కథలు తయారు చేయించి బాలయ్య ముందు పెట్టాడు కానీ.. ఏదీ వర్కవుట్ కాలేదు.

ఈలోపు ‘యన్.టి.ఆర్’ ముందుకు కదిలింది. బాలయ్య అందులో బిజీ అయిపోయాడు. దాని తర్వాత కూడా బాలయ్య ఖాళీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. బోయపాటి శ్రీను లైన్లోకి వచ్చేస్తున్నాడు. మొత్తానికి బాలయ్య-వినాయక్ సినిమా ఉండదని దాదాపుగా తేలిపోయింది. మరోవైపు వినాయక్ కు ఇంకెవ్వరూ కూడా సినిమా ఇచ్చే పరిస్థితి లేదు. వినాయక్ వేరే హీరోల్ని కూడా ట్రై చేసి విఫలమయ్యాడట. నిర్మాత ఉన్నా.. హీరో దొరక్కపోవడం అంటే వినాయక్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే వినాయక్ పుట్టిన రోజు జరుపుకున్నాడు. గతంలో అతడి బర్త్ డే అంటే.. తనతో కమిట్మెంట్లు ఉన్న నిర్మాతలు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చేవాళ్లు. సినిమాలు అనౌన్స్ చేసేవాళ్లు. ఇదో జాతర లాగా ఉండేది. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించలేదు. సి.కళ్యాణ్ విష్ చేస్తూ యాడ్ ఇచ్చాడు కానీ.. అందులో సినిమా ఏమీ ప్రకటించలేదు. పరిస్థితి చూస్తుంటే వినాయక్ ఇప్పుడిప్పుడే ఎవరితోనూ సినిమా చేసే అవకాశాలు కనిపించడం లేదు.
Please Read Disclaimer