యువతితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ పోలీస్

0warangal-police-officer-booked-red-handedly-infront-his-familyవరంగల్‌కు చెందిన మహిళా పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు ఓ వివాదంలో ఇరుక్కున్నారు. రాత్రి సమయంలో వేరే యువతితో తన వాహనంలో వెళ్తుండగా.. కుటుంబ సభ్యులే పట్టుకున్నారు. దీంతో దొరికిపోయాననుకున్న సదరు అధికారి యువతిని వాహనంలోనే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

హసన్ పర్తి రోడ్డు మార్గంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద అధికారిగా ముద్రపడ్డ ఇతనిపై గతంలోను పలు ఆరోపణలు వచ్చాయి. మంగళవారం రాత్రి ఓ యువతిని తీసుకుని హసన్ పర్తి వైపు వెళ్తుండగా.. అతని కుటుంబ సభ్యులే అడ్డుకున్నారు.

అతని తీరుపై ఉన్న అనుమానంతోనే వాహనాన్ని వెంబడించి మరీ అడ్డుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులను చూడగానే సదరు అధికారి పరారవగా.. యువతిని విచారించడంతో అతని లీలలు బయటపడ్డాయి. రాత్రి సమయంలో రోడ్డుపై కుటుంబ సభ్యులకు, అతనికి మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. విషయం సీపీ దాకా వెళ్లడంతో.. దీనిపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

మహిళలకు రక్షణ కల్పించాల్సిన అధికారే ఇలా అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.