‘పద్మావతి’ సినిమా విడుదలకు మార్గం

0padmavati-to-be-release‘పద్మావతి’ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. బాలీవుడ్‌ నటులు దీపికా పదుకొణె, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకుడు. రాజ్‌పుత్‌ మహారాణి పద్మిని జీవితం ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. కాగా ఇందులో తమ మహారాణి పద్మిని గురించి తప్పుగా చూపించారని రాజ్‌పుత్‌ కర్ణిసేన కార్యకర్తలు, పలువురు భాజపా నేతలు ఆందోళనలు చేశారు. సినిమా విడుదలను వ్యతిరేకించారు.

మరోపక్క నిర్మాతలు సెన్సార్‌ కోసం పంపిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందని సెన్సారు బోర్డు సభ్యులు సర్టిఫికెట్‌ ఇవ్వడానికి తొలుత నిరాకరించారు. దీంతో డిసెంబరు 1న అనుకున్న తేదీకి సినిమా విడుదల కాలేదు. అసలు ఈ సినిమాను దేని ఆధారంగా తీశారన్న విషయం స్పష్టంగా పేర్కొనలేదని రెండోసారి కూడా సర్టిఫికెట్‌ ఇవ్వడానికి సెన్సార్‌ నిరాకరించినట్లు సమాచారం.

అయితే శనివారం ఈ చిత్రం సెన్సార్‌ పూర్తిచేసుకుంది. సెన్సారు బోర్డు నుంచి యూఏ సర్టిఫికెట్‌ పొందింది. అయితే సినిమా టైటిల్‌ను మార్చాలని నిర్మాతలకు సూచించినట్లు తెలుస్తోంది. ‘పద్మావతి’ని కాస్త ‘పద్మావత్‌’ అని మార్చాలని చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సినిమా కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ఇంకా ప్రకటించలేదు.