అశ్విన్ ని కొనలేకపోయాం

0ashwin-7-croresభారత స్పిన్‌ మాంత్రికుడు రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఐపీఎల్‌లో ఆర్‌టీఎమ్‌(రైట్‌ టు మ్యాచ్‌) ద్వారా దక్కించుకుంటామని చెన్నై సూపర్‌కింగ్స్‌ వెల్లడించింది. కానీ, వేలంలో అశ్విన్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రూ.7.6కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. తామే దక్కించుకుంటామన్న చెన్నై.. అశ్విన్‌ను ఎందుకు వదిలేసింది. ఈ ప్రశ్నపై తాజాగా ఆ జట్టు కోచ్‌ స్టీపెన్‌ ఫ్లెమింగ్‌ స్పందించాడు.

‘వేలంలో అశ్విన్‌ను దక్కించుకోవాలనుకోవడం నిజం. అతని కోసం రూ.4కోట్ల వరకు ఖర్చు చేయాలని వేలానికి ముందే ప్రణాళిక కూడా వేసుకున్నాం. కానీ, సీనియర్‌ ఆటగాడైన అశ్విన్‌ కోసం చాలా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపాయి. దీంతో అతని ధర ఒకానొక సమయంలో రూ.7కోట్లకు పైగా చేరింది. జట్టులో ఇంకా భర్తీ చేయాలంటే ఎంతో మంది ఆటగాళ్లను కొనాలి. మా దగ్గర ఉన్న మొత్తం తక్కువ. అశ్విన్‌ ధర మాత్రం పెరుగుతూనే ఉంది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రూ.7.6కోట్ల వద్ద ఆగింది. ఈ సమయంలో సహచరులమంతా చర్చించుకుని అశ్విన్‌ను వదిలేద్దాం అని నిర్ణయించుకున్నాం. జట్టులో సీనియర్‌ స్పిన్నర్‌ ఎంతో అవసరం. అందుకే రూ.2కోట్లు పెట్టి హర్భజన్ ‌సింగ్‌ను కొనుగోలు చేశాం’ అని ఫ్లెమింగ్‌ వివరించాడు. ఇక హర్భజన్‌ విషయానికొస్తే ఆర్‌టీఎమ్‌ అవకాశం ఉన్నా ముంబయి ఇండియన్స్‌ అతడ్ని వదిలేసుకుంది.