పశ్చిమ బెంగాల్ కాదు…బంగ్లా!

0కొద్ది రోజులుగా తమ రాష్ట్ర పేరును మార్చేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. తమ రాష్ట్ర పేరును బంగ్లా గా మార్చాలని దీదీ యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పేరు మార్పునకు సంబంధించి నేడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పేరును ‘బంగ్లా’గా మార్చుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ గురువారం తీర్మానం చేసింది. ఇకపై అన్ని భాషల్లోనూ ‘బంగ్లా’ అనే పేరే ఉంటుందని ఆ తీర్మానంలో పేర్కొంది. అయితే ప్రస్తుతం ఈ తీర్మానాన్ని పశ్చిబెంగాల్ ప్రభుత్వం…..కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ పంపింది. కేంద్ర హోం శాఖ ఆమోదం పొందిన తర్వాత ఈ కొత్త పేరు అమల్లోకి రానుంది. ప్రస్తుతం బెంగాల్ ని పశ్చిమ్ బంగా – పశ్చిమ్ బంగ్లా అని పిలుస్తున్న సంగతి తెలిసిందే.

పశ్చిమ బెంగాల్ పేరులో మార్పుపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. అయితే 2016లో పశ్చిమ బెంగాల్ పేరును బెంగాలీలో ‘బంగ్లా’గా – ఇంగ్లిష్ లో ‘బెంగాల్’ గా – హిందీలో ‘బంగాల్’ గా మార్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ నిర్ణయాన్ని విషక్ష కాంగ్రెస్ – బీజేపీ – వామపక్షాలు వ్యతిరేకించాయి. 3 భాషల్లో వేర్వేరు పేర్లు కాకుండా ఒకే పేరు ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో 2017 సెప్టెంబర్ 17న పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగ్లా’ గా మార్చుతూ దీదీ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అసెంబ్లీలో అందుకు సంబంధించిన తీర్మానం ఆమోదం పొందడంతో….ఇక ఆ పేరు దాదాపుగా ఖరారైనట్లే. అయితే కేంద్రం ఆమోదించిన తర్వాతే ఆ పేరు అమల్లోకి రానుంది. మరోవైపు ఈ పేరుపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్ లో అక్రమంగా చెలామణిలో ఉన్న ఓ లిక్కర్ బ్రాండ్ కు బంగ్లా అనే పేరు ఉండడంతో వారు అభ్యంతరం తెలుపుతున్నారు.