పవన్ చెప్పింది సోమవారం రుజువైంది

0pawan-said-is-absolutely-trజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ బ్రహ్మాండం బద్దలైపోతుందన్నట్లుగా ఉంటుంది పరిస్థితి.

అభిమానుల అత్యుత్సాహాం, వారిని అదుపుచేయలేక సెక్యూరిటీ సిబ్బంది పడే హైరానా.. జనం తోపులాటను నెట్టుకుంటూ కెమెరాలతో పరిగెత్తే మీడియా.. అంతా ఓ సునామీ వాతావరణమే.

అందుకే పవన్ కళ్యాణ్ సైతం చాలా సందర్భాల్లో ఒక మాట చెబుతుంటారు. తానెక్కడికి వెళ్లిన విపరీతమైన జనం వస్తారు కాబట్టి.. సమస్య కన్నా వీరి మీద దృష్టి పెట్టడానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుందని. అందుకే వీలైనంత మేర బహిరంగ సమావేశాలకు దూరంగా ఉంటానని చెబుతుంటారాయన.

పవన్ చెప్పిన మాట ఎంత ‘అక్షర సత్యమో’ మరోసారి రుజువైంది. సోమవారం ఆయన సీఎంతో భేటీ అయిన సందర్భంగా.. ఏపీ సచివాలయానికి జనం తాకిడి పెరిగింది. జనసేనాని చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో.. సెక్యూరిటీ సిబ్బందికి వారిని అదుపు చేయడం కష్టంగా మారింది.

ఆ సంగతలా ఉంటే.. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు పెట్టుకునేందుకు వచ్చినవారికి కూడా ఈ ఎఫెక్ట్ తప్పలేదు. పవన్ వస్తున్నారన్న కారణంతో.. వారందరిని గంటల పాటు లోపలికి రానివ్వలేదు. సీఎం బ్లాక్ లోనే ఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నందువల్ల.. పవన్ వెళ్లిపోయేంత వరకు వారిని ఆ దరిదాపుల్లోకి రానివ్వలేదు.

అటు సెక్రటేరియట్ ఉద్యోగులు కూడా పవన్ రాకవల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా కొన్ని ఆంక్షలు విధించడంతో.. వారికీ ఇబ్బందులు తప్పలేదు. అయితే చాలామంది మాత్రం దీన్ని అతిగానే అభివర్ణిస్తున్నారు. నిజానికి పవన్ పొలిటికల్ గా అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ కానప్పటికీ.. సీఎం చంద్రబాబు ఆయనకంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారని చాలామంది ఉద్యోగులు బాహాటంగానే మాట్లాడుతున్నారు.