విజయ్ `వాట్ ద ఎఫ్` లిరిక్స్ పై వివాదం!

0



`అర్జున్ రెడ్డి`తో యంగ్ హీరో విజయ్ దేవరకొండకు విపరీతమైన పాపులారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పోస్టర్ వివాదం…ఆ తర్వాత….సినిమాలో….ఓ డైలాగ్….ప్రమోషన్ ఈవెంట్లో విజయ్….వాట్ ద ఎఫ్ ….అంటూ స్టేజీమీద చెప్పిన డైలాగ్….వివాదాస్పదమైన విషయం విదితమే. అయితే తన అప్ కమింగ్ మూవీ `గీత గోవిందం`లో విజయ్ తో పాటు ఆ `ఎఫ్`పదం వివాదం కూడ ట్రావెల్ అయినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ `వాట్ ద ఎఫ్ `అంటూ విజయ్ పాడిన పాట తాలూకు లిరిక్స్ వివాదాస్పదమయ్యేలా కనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఆ పాట లిరికల్ వీడియో….ఓ మతం మనోభావాలు దెబ్బతీసేలా ఉండడంతో ఆ పాటపై వివాదం చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి. హిందువులు అతి పవిత్రంగా ఆరాధించే సీతా దేవి – సతీ సావిత్రిలపై ఆ పాటలోని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘గీత గోవిందం’ సినిమాలో విజయ్ స్వయంగా పాడిన `వాట్ ద ఎఫ్`పాట లిరికల్ వీడియో ను తాజాగా రిలీజ్ చేశారు. రికార్డింగ్ స్టూడియోలో విజయ్ పాడుతున్న వీడియో కూడా ఆ పాటలో కనిపిస్తుంది. “అమెరికా గాళ్ అయినా . . అత్తిలి గాళ్ అయినా .. యూరప్ గాళ్ అయినా .. యానాం గాళ్ అయినా…..అమ్మాయిలంటేనే టప్ఫూ….ఆళ్ల తిక్కకు మనమే స్టప్ఫు…దానికి నేనే ప్రూ ఫు….వాట్ ద వాట్ ద ఎఫ్ ….అంటూ ఆ పాట సాగుతోంది” అంటూ ఈ పాట జోరుగా సాగింది. అయితే ఆ పాట మధ్యలో ….“రాముడు గాని ఇప్పుడు పుట్టి….జంగల్ కు పోదాం రారమ్మంటే….సీతకు కాస్త సిరాకు లేసి సోలోగానే పొమ్మంటాదే….యమపాశంతో యముడే వచ్చి నీ పెనిమిటి ప్రాణం తీస్తానంటే….నెట్ ఫ్లిక్స్ చూస్తూ ఈ సావిత్రి….లేటేంటంటూ కుమ్మేస్తాదే….మగాళ్లకి గోల్డెన్ డేసు పురాణాల్లోనే బాసు….“ అంటూ ఆ పాట సాగుతోంది.

అయితే గోపీసుందర్ సంగీతంలో శ్రీమణి రచించిన ఆ పాటపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీత సావిత్రిల ఖ్యాతిని అపహాస్యం చేసేలా ఆ పాట లిరిక్స్ ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. హిందువులు సాఫ్ట్ టార్గెట్ అయ్యారని…అందుకే ఈ తరహా లిరిక్స్ – వివాదాలు వస్తున్నాయని పలు హిందు సంస్థలు మండిపడుతున్నాయి. మరోవైపు రాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు….ఆ తర్వాత మహేష్ – పరిపూర్ణానంద స్వామి ల నగర బహిష్కరణ వివాదం సద్దుమణగకముందే …మరోసారి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఈ పాట ఉండడం చర్చనీయాంశమైంది. ఏ మతం వారి మనోభావాలు దెబ్బతిన్నా తాము సహించబోమని…కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ – కేటీఆర్ – డీజీపీలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్….ఈ పాటపై – చిత్ర యూనిట్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.