‘గురు’ చూసి చిరు భార్య ఏడ్చేసిందట…

0Chiru-Wife-Surekha-Criedవిక్టరీ వెంకటేష్ కొత్త సినిమా ‘గురు’ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే రాబట్టుకుంటోంది. తెలుగు సినిమాల్లో ‘గురు’ ఒక వెల్కమ్ ఛేంజ్ అనడంలో సందేహం లేదు. ఒక స్టార్ హీరో ఇలాంటి సినిమా చేయడం.. ఇలాంటి పాత్ర పోషించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. రీమేక్ అయినప్పటికీ ఎమోషనల్‌గా జనాల్ని కదిలిస్తూ మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది ‘గురు’.

ఈ సినిమా చూసి సామాన్య ప్రేక్షకులే కాదు.. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ సైతం ఎమోషనల్ అయ్యారట. ముందు ఈ సినిమాపై అంతగా ఆసక్తి చూపించని ఆమె.. సినిమా చూశాక మాత్రం ఉద్వేగానికి లోనయ్యారట. ఈ సంగతి వెంకీనే వెల్లడించాడు. వెంకీ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు రాబోతుండటంతో చిరు తన సతీమణితో కలిసి ‘గురు’ సినిమా చూశారు.

‘‘చిరంజీవి గారి భార్య సురేఖ గారు బాక్సింగ్ సినిమా ఏముంటుందిలే అనుకున్నారట. ఆమె సినిమా చూడ్డానికి అంతగా ఆసక్తి చూపలేదట. అయినా చిరంజీవి గారు బలవంతంగా ‘గురు’ ప్రివ్యూకు తీసుకొచ్చారట. కానీ సినిమా చూశాక… ‘ఇది బాక్సింగ్‌ మూవీ కాదు.. మంచి ఎమోషన్‌’ అంటూ ఏడ్చేశారు. ఆమెకు అంత బాగా నచ్చింది. ఇక చిరంజీవి గారైతే నన్ను ఎంతగా పొగిడారో. ‘హ్యాట్సాఫ్‌ టు యు. ఆ లుక్ ఏంటి అసలు.. నాకు మీ నాన్న అంత వయసు అనే హీరోయిన్‌తో చెప్పే డైలాగ్‌కు ఒప్పుకోవడం మామూలు విషయం కాదు. చాలా పెద్ద రిస్క్‌. నువ్వు ఎప్పుడూ రిస్క్‌ తీసుకుంటావ్‌’ అంటూ మెచ్చుకున్నారు. చిరంజీవి గారికి నా ఛాయిస్‌ నచ్చింది. హీరోగా నేను తీసుకున్న రిస్క్‌ విషయంలో అభినందించారు’’ అని వెంకీ తెలిపాడు.