బాబు చర్చించింది జగన్‌కు ఎలా చేరింది?

0chandrababuటిడిపిలో ఇంటి దొంగలున్నారా….పార్టీ తీసుకొనే నిర్ణయాలు వైసీపీ అధినేత జగన్‌కు చేరుతున్నాయా అంటే అవుననే అబిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు టిడిపి నేతలు. అయితే గతంలో వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడ ఇదే తరహాలో తమ పార్టీ నిర్ణయాలను లీకయ్యాయని టిడిపి నేతలు గుర్తుచేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయానికి సంబంధించిన అంశంపై పార్టీ సీనియర్లతో చర్చించారు.అయితే ఈ విషయమై చర్చించిన కొన్నిరోజులకే ఇదే నిర్ణయాన్ని వైసీపీ అధినేత జగన్ ప్లీనరీ వేదికగా ప్రకటించడం ప్రస్తుతం టిడిపి నేతల్లో చర్చకు దారితీస్తోంది.

పార్టీ ముఖ్య నాయకులతో చేసిన చర్చల సారాంశం వైసీపీ చీఫ్‌కు ఎలా చేరిందనే విషయమే ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ అంశం పార్టీ నేతల నుండి చేరిందా…లేదా వైసీపీ తమ మేనిఫెస్టోలో పెట్టాలని అనౌన్స్ చేశారా అనే చర్చ కూడ లేకపోలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.200లుగా ఉన్న పెన్షన్‌ను వెయ్యిరూపాయాలకు పెంచుతూ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పెన్షన్‌ను వెయ్యిరూపాయాలను చెల్లిస్తోంది. వికలాంగులకు నెలకు రూ.1500 చొప్పున పెన్షన్‌లు చెల్లిస్తున్నారు. పెన్షన్ మొత్తాన్ని రెండువేలకు పెంచితే ఎలా ఉంటుందనే విషయమై పార్టీ సీనియర్‌లతో బాబు చర్చించారు. ఈ పథకం వారికి ప్రయోజనంగా ఉంటుందని సీనియర్ నేతలు కూడ అభిప్రాయపడ్డారు.త్వరలోనే ఈ విషయాన్ని అమలుచేయాలనే యోచనలో బాబు ఉన్నారు.

గుంటూరు వేదికగా నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో పెన్షన్‌ను రూ.2వేలు చెల్లించనున్నట్టు వైసీపీ చీఫ్ జగన్ ప్రకటించారు. అయితే తాము ప్రకటించాలనుకొన్న పథకాన్ని జగన్ ప్రకటించేసరికి టిడిపి నేతలు విస్తుపోయారు. చంద్రబాబుతో జరిగిన చర్చల సారాంశం జగన్‌కు ఎలా లీకైందనే విషయమై పెద్ద చర్చసాగుతోంది.అయితే లీకువీరులెవరనే విషయమై పార్టీవర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో కూడ టిడిపి నుండి కొందరు ముఖ్యనాయకుల నుండి సమాచారం వైఎస్‌కు చేరేదని పార్టీ నాయకులు గుర్తించారు. తాము అధికారంలోకి వస్తే రూ. 2లకే కిలో బియ్యం పధకాన్ని తీసుకురావాలని పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించారు.అయితే ఆ సమయంలోనే ఈ విషయాన్ని టిడిపి నేత ఒకరు వైఎస్‌కు సమాచారాన్ని లీక్ చేశారనే పార్టీలో ప్రచారంలో ఉంది.అయితే ఈ విషయం తెలిసిన వెంటనే వైఎస్ రెండు రూపాయాలకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారని టిడిపి నేతలు గుర్తుచేస్తారు.

ప్రస్తుతం వెయ్యిరూపాయాలను పెన్షన్‌గా చెల్లిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో పెన్షన్‌ను రెండువేలుగా నిర్ణయిస్తే ప్రజలు తమవైపుకు మళ్ళే అవకాశం ఉందని భావించిన వైసీపీ ఆ మేరకు పెన్షన్‌ను రూ2 వేలు చేస్తామని ప్రకటించిందా అనే అనుమానాలు కూడ లేకపోలేదు.అయితే టిడిపి నేతలు కొందరు మాత్రం ఈ విషయం లీకైందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఈ విషయం లీకైతే మాత్రం పార్టీకి చిక్కులు తప్పవు. లీక్ వీరులను గుర్తించకపోతే రానున్న రోజుల్లో పార్టీ మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలున్నాయంటున్నారు పార్టీ సీనియర్లు.