మల్టీప్లెక్స్: సినిమా టికెట్ రూ.150, పాప్‌కార్న్ రూ.270 ఎందుకిలా?

0



మల్టీప్లెక్స్ థియేటర్‌లోకి బయటి ఆహారాన్ని ఎందుకు అనుమతించరు? బయట అమ్మే రేట్ల కంటే అనేక రెట్లు పెంచి సామాన్యుడిని బాదేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని వినియోగదారుల ఆవేదన ఎప్పటినుంచో ఉంది. బయటి తిండి అస్సలు అనుమతించకపోవడం వివాదాస్పదంగానే ఉంటూ వస్తున్నది. కొన్నిమల్టీప్లెక్సులు అస్సలు మంచినీటి బాటిళ్లను కూడా అనుమతించవు. బయట పది రూపాయలకు దొరికే అరలీటర్ బాటిల్ను కూడా నలభై యాభై రూపాయలకు అమ్మడం ఆనవాయితీ. చిన్న కుటుంబం టిక్కెట్లకు ఆరొందలు పెడితే లోపల పాప్ కార్న్ లాంటి వాటికి అంతకుమించి ఖర్చు పెట్టాల్సివస్తున్నది. ఈ వివాదాల నడుమ మల్టీప్లెక్స్ థియేటర్లు బయటి ఆహారపదార్థాలను లోపలికి అనుమతించాలని తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇపుడీ అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది.

చట్టం ఏం చెబుతోంది? వినియోగదారులు ఏమంటున్నారు? అధికారులు ఏమంటున్నారు? ప్రభుత్వం ఏమంటోంది?

అసలు థియేటర్లలోకి ఆహారాన్ని నిషేధించే నిబంధన ఏదీ లేదని అధికారులు బీబీసీకి వివరించారు. ఆహారాన్ని సైతం బయట మార్కెట్ ధరలకే అమ్మాలని చెబుతున్నారు. కానీ థియేటర్లలో మాత్రం ధరలు బయటికంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి.

అలాగే ‘బయటి ఆహారాన్ని థియేటర్లోకి తీసుకురాకూడదు’ అన్న బోర్డులూ కనిపిస్తూనే ఉన్నాయి.

అన్నీ అక్కడే

తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల్లో మల్టీప్లెక్స్‌ థియేటర్ల సంస్కృతి బాగా విస్తరిస్తోంది. మెట్రో నగరమైన హైదరాబాద్‌లో ఈ థియేటర్లు చాలా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలోనూ వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

దృశ్యంలో స్పష్టత, శబ్దంలో నాణ్యతతో పాటు సౌకర్యవంతమైన సీట్లు, ఏసీ వంటి హంగులతో ఉండే మల్టీప్లెక్స్ థియేటర్లకు ఆదరణ పెరుగుతోంది. ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లలాగా సినిమా వీక్షణం కూడా సౌకర్యవంతంగా ఉంటుందని మధ్యతరగతి వీటిని ఎంచుకుంటోంది. ఇక షాపింగ్ మాల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు చిన్న థియేటర్లను కొనేసి వాటిని మల్టీప్లెక్స్‌లుగా తీర్చిదిద్దుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల సామాన్యులు అనివార్యంగా వీటిలోనే సినిమా చూడాల్సిన పరిస్థితి వస్తోంది.

మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒకేసారి రెండుమూడు రకాల సినిమాలు ఆడుతుంటాయి. వీటిని మరింత ముందుకు తీసుకెళ్లి షాపింగ్‌తో మిళితం చేశారు. ఆ తరువాత ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు తెరిచారు. అంటే సినిమా చూసుకొని.. షాపింగ్ చేసుకొని.. భోజనం ముగించుకొని ఇంటికి రావొచ్చు. సినిమా కోసం వచ్చే వినియోగదారుని చేత సాధ్యమైనంత వరకు ఖర్చుపెట్టించాలన్నది మల్టీప్లెక్స్‌ల ముఖ్యఉద్దేశంగా కనిపిస్తోంది.

బయటి ఆహారపదార్థాలు నిషేధం

బయట నుంచి తెచ్చుకోనివ్వరు లోపల ధరలు మామూలుగా ఉండవు ఇలా అయితే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా స్థానిక పత్రిక ఆంధ్రజ్యోతి హైదరాబాద్‌లో నిర్వహించిన సర్వేలో 83శాతం మంది బయటి స్నాక్స్ అనుమతించాలని అభిప్రాయపడ్డారు.

‘చిన్న పిల్లలని కూడా చూడలేదు’

పొదిలి ధనలక్ష్మి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. పిల్లలతో సినిమాకు వెళ్లినప్పుడు ఆహారం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆమె చెబుతున్నారు. “మా పిల్లలు బయటి పదార్థాలు తినరు. అందుకని కొన్ని పండ్ల ముక్కలు తీసుకెళ్లాం. భద్రతా సిబ్బంది వాటిని కూడా లోపలికి అనుమతించలేదు” అని ధనలక్ష్మి అన్నారు.

‘ఎంఆర్‌పీలు విపరీతంగా పెంచుతున్నారు’

విశాఖపట్నానికి చెందిన బోగి ప్రసాద్ కూడా మల్టీప్లెక్స్ థియేటర్ల తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

“ఎంఆర్‌పీకే విక్రయించాలని ప్రభుత్వం చెబుతోంది. ఎక్కడా అది అమల్లోకి రావడం లేదు. బయట రూ.10 దొరికే వస్తువుపై రూ.50 ఎంఆర్‌పీ వేసి అమ్ముతున్నారు. చిన్న గ్లాసు కోక్‌కు రూ.80, రూ.100 వసూలు చేస్తున్నారు. పాప్ కార్న్ విషయంలో దోచుకుంటున్నారు. కుటుంబంతో వెళ్లినప్పుడు సినిమా టికెట్ కంటే వీటికే ఎక్కువ ఖర్చవుతోంది. ఇప్పుడు చిన్న థియేటర్లు కూడా మల్టీప్లెక్స్‌లను చూసి నేర్చుకుంటున్నాయి” అని ప్రసాద్ తన బాధను వెల్లబోసుకున్నారు.

రెండు సమోసా రూ.113

బీబీసీ కూడా కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్ల వెబ్‌సైట్లలో ఆహారపదార్థాల ధరలను పరిశీలించింది. పీవీఆర్ సినిమాస్ వెబ్‌సైట్ ద్వారా హైదరాబాద్‌లో సినిమా టికెట్ బుక్ చేసుకొని డబ్బులు చెల్లించే ముందు ఒక పాపప్ విండో వచ్చింది. అందులో రకరకాల తినుబండారాలు, పానీయాల జాబితా ఉంది. గ్లాసు పెప్సీ ధర రూ.195 నుంచి రూ.308 మధ్య ఉంది. పాప్ కార్న్ రూ.210 నుంచి రూ.270 మధ్య ఉంది. పీజా ధర రూ.230, బర్గర్ రూ.160-170గా ఉన్నాయి.

అలాగే మరో సంస్థ ఐనాక్స్ మూవీస్ వెబ్‌సైట్‌లో చూసినప్పుడు పాప్‌కార్న్ ధరలు రూ.210 నుంచి రూ.340 మధ్య ఉన్నాయి. గ్లాసు కోక్ రూ.210-240గా ఉంది. రెండు సమోసాల ఖరీదు రూ.113. ఇక కాంబోల విషయానికి వస్తే రూ.380 నుంచి రూ.700 మధ్య ఉన్నాయి. ఇతర సంస్థల్లో కూడా ధరలు అటుఇటుగా ఇలాగే ఉన్నాయి. అధిక ధరలపై ఎక్కువ మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆ సమయంలో అసహనం వ్యక్తం చేసి వదిలేయడం తప్ప దీన్ని పరిశోధించి నిబంధనలపై సంస్థలను నిలదీసేంత సమయమూ తీరిక వారికి ఉండవు.