కట్టప్ప పెంచాడు చంపాడు

0Why-kattappa-killed-bahubaliబాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నకి సమాధానం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆ ప్రశ్న సినిమాపై పెంచిన అంచనాలు అన్నీ ఇన్నీ కావు. సినిమా చివర్లో ఒక మంచి మలుపులా ఉంటుందనుకొన్నాను తప్ప, ఆ ప్రశ్న ఇంతగా ఆసక్తిని రేకెత్తిస్తుందని మాత్రం వూహించలేదని దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి చెబుతున్నారు. ఆ ప్రశ్నతో ఏర్పడిన అంచనాలన్నీ మాకు బలమే తప్ప, ఒత్తిడిగా మాత్రం ఎప్పుడూ భావించలేదు అంటున్నారాయన. ‘బాహుబలి: ది బిగినింగ్‌’కి కొనసాగింపుగా తెరకెక్కిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ వచ్చే నెల 28న విడుదల కాబోతోంది. ఈ నెల 16న థియేట్రికల్‌ ట్రైలర్‌ని విడుదల చేస్తున్నారు. ఆ విషయాన్ని ‘బాహుబలి’ ఫేస్‌బుక్‌ పేజ్‌ ద్వారా వెల్లడించారు రాజమౌళి. ‘‘‘బాహుబలి: ది బిగినింగ్‌’ ట్రైలర్‌ విడుదల చేసినట్లే ఈసారీ థియేటర్లలో విడుదల చేస్తాం. ఇదివరకటి కంటే ఎక్కువ థియేటర్లలో ఉదయమే ప్రచార చిత్రం ప్రదర్శితమవుతుంది. అదే రోజు సాయంత్రం ముంబయిలో హిందీ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరుగుతుంది. అలాగే సామాజిక అనుసంధాన వేదికల్లోనూ విడుదల చేస్తాం’’ అని చెప్పారు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ. కొనసాగింపుగా మూడో చిత్రం కూడా ఉంటుందా? అన్న ప్రశ్నకు రాజమౌళి బదులిస్తూ… ‘‘మేం మొదట అనుకొన్న కథ ఈ సినిమాతోనే పూర్తవుతుంది. అంతే తప్ప దీన్ని సాగదీసే ఉద్దేశం లేదు. అయితే ఈ ఫ్రాంచైజీ మాత్రం కొనసాగుతుంద’’ని చెప్పారు. ఇలాంటి మరిన్ని చిత్రాల్ని మీ నుంచి ఆశించవచ్చా అన్న ప్రశ్నకు స్పందిస్తూ ‘‘బాహుబలిని తీయడానికే ఐదేళ్లు పట్టింది. ఇలాంటివి ఇంకా చేస్తే రెండు సినిమాలతో జీవితమే అయిపోతుంది’’ అని బదులిచ్చారు. ఓ సినిమాని పరిమిత వ్యయంతో తీయాలా, భారీ వ్యయంతో తీయాలా అనే విషయాన్ని కథని బట్టే నిర్ణయం తీసుకొంటానని, ఒక దర్శకుడిగా ఆ రెండు రకాల సినిమాల్నీ తీయడానికి ఇష్టపడతానని రాజమౌళి స్పష్టం చేశారు. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’లో దేవసేన పాత్ర శివగామి పాత్ర అంత శక్తిమంతంగా ఉంటుందని, ఆ రెండు పాత్రల మధ్య డ్రామా కూడా చాలా బాగుంటుందని ఆయన తెలిపారు. తన కలల చిత్రం ‘మహాభారతం’ గురించి ఫేస్‌బుక్‌లో స్పందించారు రాజమౌళి. ‘‘మహాభారతం చిత్రానికి సంబంధించి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అయితే దాన్ని ఇప్పట్లో చేసే ఆలోచన లేదు. మరో పదేళ్ల తర్వాత ఉండొచ్చు. అప్పటి సాంకేతికతని, అప్పటి ప్రేక్షకుల ఆలోచనల్ని దృష్టిలో ఉంచుకొని ఆ సినిమా చేస్తా’’ అన్నారు రాజమౌళి.

ప్రచార చిత్రం
‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’కి సంబంధించిన ఓ ప్రచార చిత్రాన్ని శనివారం ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఆ ప్రచార చిత్రంలో కట్టప్ప చిన్నప్పటి బాహుబలిని ఎత్తుకొని మురిపెంగా చూడటం ఒక పక్క… అదే బాహుబలిని తన చేతులతోనే కత్తిపోటుతో చంపేస్తుండడం మరోపక్క కనిపిస్తోంది. ‘అతనే పెంచాడు.. అతనే చంపాడు’ అనే క్యాప్షన్‌ రాశారు. ‘ఈ ప్రచార చిత్రం చూడగానే వెంటనే ట్వీట్‌ చేయాలనిపించింద’ని రాజమౌళి ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులుగా నటించిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు.