బాలయ్యపై ఎంపీ కవిత ప్రశంసలు

0నందమూరి బాలకృష్ణ తెలుగు దేశం పార్టీలో కీలక నేత. ఆ పార్టీ ఎమ్మెల్యే. ఆయన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు చెందిన నేతలు పొగిడితే ఒకింత ఆశ్చర్యపోవాల్సిందే. అందులోనూ ఆ పార్టీలో పెద్ద నాయకురాలైన ఎంపీ కవిత పొగిడితే మరింతగా ఆశ్చర్యం కలుగుతుంది. ఐతే ఇక్కడ ఆమె పాల్గొన్న కార్యక్రమం అలాంటిది మరి. నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో నడుస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వార్షికోత్సవానికి కవిత హాజరయ్యారు.

ఈ సందర్భంగా నందమూరి తారక రామారావుతో పాటు బాలయ్య మీదా ఆమె ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అని.. ఆయనది అందరికీ సాయం చేసే మనస్తత్వమని.. ఎన్టీఆర్ నటనను వారసత్వంగా తీసుకున్న బాలయ్య ఆయన సేవా దృక్పథాన్ని కూడా అలవరచుుకున్నారని కవిత అన్నారు. బసవతారకం ఆసుపత్రిని ఎన్టీఆర్ గొప్ప లక్ష్యంతో మొదలుపెట్టారని.. దీన్ని బాలయ్య ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని కవిత చెప్పారు. బాలయ్య కథానాయకుడిగా నటించబోయే ఎన్టీఆర్ బయోపిక్ గొప్ప విజయం సాధించాలని ఆమె అభిలషించారు.

ఈ కార్యక్రమంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కథానాయిక శ్రియ కూడా పాల్గొంది. బసవతారకం ఆసుపత్రి పేదలకు అందిస్తున్న వైద్య సేవల్ని కొనియాడారు. బాలయ్య సన్నిహితుడైన దర్శకుడు బోయపాటి శ్రీను సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అతను ఆసుపత్రికి రూ.10 లక్షల విరాళం ప్రకటించడం విశేషం.