నేను చచ్చిపోయాక పీకే ట్వీట్ చేస్తాడా? మహేష్ కత్తి

0kathi-maheshపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ విమర్శకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ మహేష్ కత్తి విషయంలో కొన్ని రోజులుగా మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరోపై మహేష్ కత్తి చేసిన కామెంట్లను తట్టుకోలేని వేలాది మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనపై సోషల్ మీడియా ద్వారా, ఫోన్ల ద్వారా దాడి చేయడం మొదలు పెట్టారు.

పవన్ కళ్యాణ్ అభిమానులు తనను బూతులు తిడుతూ వేధిస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని మహేష్ కత్తి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఈ ఇష్యూకు సంబంధించి ఓ టీవీ చర్చాకార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు.

వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గురించి నాకు తెలియదు. ఆయన అభిమానులు చాలా మంది సెన్సిటివ్ హ్యూమన్ బీయింగ్ అని చెబుతుంటారు. మరి అలాంటి వ్యక్తి నాపై అతడి అభిమానులచే ఇంత దాడి జరుగుతుంటే, వేధింపులకు గురి చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదు అని మహేష్ కత్తి ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ అభిమానులు నన్ను దారుణంగా వేధిస్తున్నారు, చంపుతామని బెదిరిస్తున్నారు, అలాంటివి చూసి నా కుటుంబ సభ్యులు, కుమారుడు భయ పడుతున్నారు. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్‌కు స్పందించే సమయం లేదా? తన ట్విట్టర్ ద్వారా మహేష్ కత్తినిని వేధించొద్దు అని ఒక్క ట్వీట్ చేయలేడా? ఇంకెప్పుడు ట్వీట్ చేస్తాడు? నేను చచ్చిపోయాక ట్వీట్ చేస్తాడా? అంటూ మహేష్ కత్తి ఆందోళన వ్యక్తం చేశారు.

మాట్లాడితే మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంటున్నారు. వాళ్లు ఏదో ఫ్యూడల్ లార్డ్ షిప్ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. అన్ని ఫ్యామిలీల మాదిరే వారిది కూడా ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఎక్కువ మంది నటులు మాత్రమే ఉన్నారు. మెగా ఫ్యామిలీ అనేది రాజుల ఫ్యామిలీ, మనం ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదు అన్నట్టుగా కొందరు మాట్లాడుతున్నారని మహేష్ కత్తి మండి పడ్డారు.

పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించకూడదు అనేది… ఈ ప్రజాస్వామ్యంలో ఓ బూతులాంటిదని మహేష్ కత్తి అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఒక నాయకుడు అనే వ్యక్తిని సమాజంలో ఎంతో మంది ప్రశ్నిస్తారు, అలాంటివి చేయవద్దంటే ఎలా? అన్నారు.

నేను సెలబ్రిటీని అని ఎప్పుడూ ఫీలవ్వ లేదు. అతి సామాన్యమైన వ్యక్తిని….ఈ గొడవతో పవన్ ఫ్యాన్సే తనను సెలబ్రిటీని చేస్తున్నారని మహేష్ కత్తి అభిప్రాయపడ్డారు.