వచ్చిన జవాబులు రాయడమే మేలు

0copy-in-examsఎవరూ చూడట్లేదని కొందరు.. ఎక్కువ మార్కులు సాధించాలనే అత్యాశతో మరికొందరు చూచిరాతలకు పాల్పడి విద్యాజీవితాన్ని చిత్తు చేసుకుంటున్నారు. పరీక్ష గదిలో అభ్యర్థులు ఎలా వ్యవహరించాలనే దానిపై అవగాహన లేక కొందరు చిక్కులు తెచ్చుకుంటున్నారు. విలువైన సమయాన్ని వృథా చేసుకొనేకంటే వచ్చిన జవాబులు రాయడమే మేలు అని విద్యారంగ నిపుణులు వివరిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్న పలువురు అభ్యర్థులు పది, ఇంటర్‌, డిగ్రీ, ఉన్నత చదువులు చదివి తద్వారా ఉద్యోగోన్నతి సాధించాలనుకుంటారు. సంబంధిత పరీక్షలకు కనీసం సన్నద్దం కాకుండా వెళాతారు. చిట్టీలు పెట్టి లేదా పక్కవారి జవాబుపత్రంలో చూసి రాస్తూ దొరికిపోయిన ఘటనలు చాలానే ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో కొందరు ఉద్యోగాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. చూచిరాతలకు పాల్పడటం, పక్కవారి పత్రంలో చూసి రాయడం, ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం, సాంకేతిక పరికరాలు పరీక్ష గదిలో వినియోగించి జవాబులు రాయడం వంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనల్లో సంబంధిత అభ్యర్థులు ఆయా విశ్వవిద్యాలయాల నిబంధనల ప్రకారం వేటుకు గురవుతున్నారు.

ఎప్పుడైనా ముప్పే..

సాంకేతికతను వినియోగించుకొని ఎవరి కంటిలోనూ పడకుండా పరీక్షలను చూచిరాసేసి బయటకు వచ్చేసిన అభ్యర్థులకు ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. పరీక్ష అద్భుతంగా రాసేసాం.. ఎవరికీ దొరకలేదు.. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేస్తాం.. అత్యధిక మార్కులు వచ్చేస్తాయి.. అని చాలామంది అనుకుంటారు. బ్లూటూత్‌, హెడ్‌ఫోన్లు తదితర పరికరాల ద్వారా ఎవరికీ అనుమానం రాకుండా పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన పలువురు అభ్యర్థులు కొంతకాలం తర్వాత శిక్షకు గురైన సంఘటన తెలిసిందే. పరీక్ష గదిలో దొరకనంతమాత్రాన గండం గట్టెక్కిపోయిందని చాలామంది చూచి రాసిన అభ్యర్థులు అనుకుంటుంటారు. తాత్కాలికంగా గండం తప్పిపోయినా, భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రమాదం ముప్పు పొంచి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని విద్యారంగ నిపుణులు వివరిస్తున్నారు.

శిక్షలు ఇవీ..

* చూచిరాస్తూ దొరికితే ఆ పరీక్షతోపాటు తర్వాత పరీక్షలను రాసే అవకాశాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. తర్వాత కనిష్ఠంగా ఏడాదిపాటు సంబంధిత పరీక్షలకు దూరంగా ఉండాలి. ఈ నిబంధనలు విశ్వవిద్యాలయాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

* ఒక అభ్యర్థి పరీక్ష మరో అభ్యర్థి రాస్తే ఇద్దరూ శిక్షార్హులే. నేరం రుజువైతే కనిష్ఠంగా మూడేళ్ల వరకు జైలుశిక్ష తప్పదు.

* ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులు ఉద్యోగోన్నతి కోసం రాసే పరీక్షలో చూచిరాతకు పాల్పడి దొరికిపోతే.. చేస్తున్న ఉద్యోగం వూడిపోయే ప్రమాదం ఉంది.

* పరీక్ష గదిలోకి వెళ్లేప్పుడు పరీక్ష అనుమతిపత్రం(హాల్‌టికెట్‌) మినహా ఏవిధమైన ఇతర పత్రాలు ఉండకూడదు. చేతిపై ఏవిధమైన పెన్ను రాతలు ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులదే. పరీక్ష గదిలో అభ్యర్థులను సాంతం పర్యవేక్షించే అధికారం పర్యవేక్షకుడికి ఉంటుంది. పరీక్షకు సంబంధంలేని కాగితం ఉన్నా ఏడాదిపాటు పరీక్షలకు దూరంగా ఉండాల్సి వస్తుంది.