‘యాత్ర’ లో సమర శంకం

0మహానేత – దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా `యాత్ర` బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహి.వి.రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ కి – ఫస్ట్ సింగిల్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. వైయస్సార్ కి మమ్ముట్టి తప్ప వేరొక ఆప్షన్ లేదు అన్నంతగా ఆ పాత్రకు సూటయ్యారన్న ప్రశంసలు దక్కాయి.

నేడు వైయస్సార్ వర్ధంతి సందర్భంగా మహి.వి.రాఘవ్ టీమ్ `యాత్ర` సినిమా నుంచి # సమర శంఖం.. పేరుతో లిరిక్ ని రిలీజ్ చేసింది. ది గ్రేట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాటను రాశారు. కాలభైరవ పాడగా – కె సంగీతం అందించారు. వైయస్సార్ అంటే జనం గుండె చప్పుడు. పేదలు – బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ప్రజల కోసం ఆయన యాత్ర సాగింది. అందుకే ఈ పాటలో ఉపయోగించిన పదాలు – అందులో ఎమోషన్ పీక్స్ లో ఆకట్టుకున్నాయి.

ఈ కనులలో కొలువై రగిలే కలేదో నిజమై తెలవారనీ.. వెతికే వెలుగై రానీ..! అంటూ ఎంతో ఎమోషనల్ గా మొదలయ్యే ఈ లిరిక్ ఆద్యంతం భవిష్యత్ రణరంగానికి వైయస్ సిద్ధమవుతున్నారన్నదానికి చిహ్నంగా కనిపిస్తుంది. ఎక్కడో పైన లేదు యుద్ధమన్నది.. అంతరంగమే కథనరంగమైనది.. అంటూ పవర్ ఫుల్ పదజాలం ఉపయోగించారు సిరివెన్నెల.. నిప్పులే చెరగనీ నిశ్చయం.. అంటూ వైయస్సార్ యాత్ర ఆశయాన్ని హైలైట్ చేసింది లిరిక్. ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో వైయస్సార్ అభిమానులు సహా నెటిజనుల్లో జోరుగా వైరల్ అవుతోంది.