ఈ మాత్రం దానికే అలగాలా?

0ఒక సినిమా హిట్ కొట్టాలన్నా.. మంచి సినిమాగా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవాలన్నా అది ఒక్కళ్ల వల్ల అయ్యపని కాదు. సినిమా యూనిట్ మొత్తం మనసు పెట్టి పనిచేస్తేనే సక్సెస్ ఫుల్ రిజల్ట్ కనిపిస్తుంది. కానీ సినిమా ఎలా ఆడినా తనకే పేరు రావాలని హీరోలు ఆశ పడుతుంటారు. ఒక్కోసారి హీరోకంటే సినిమాలో నటించిన మిగతావాళ్లకు పేరు రావచ్చు. అందుకని సినిమానే గాలికొదిలేయడం అంటే అది కచ్చితంగా హీరో తప్పని చెప్పాలి.

ఈమధ్య కుటుంబ సమేత చిత్రమొకటి వచ్చింది. మరీ డిజాస్టర్ కాకపోయినా ఫర్వాలేదని అనిపించుకుంది. సినిమా యూనిట్ మూవీని ప్రమోట్ చేసేందుకు సక్సెస్ మీట్ పెట్టింది. దీనికి ఆ సినిమాలో నటించిన యంగ్ హీరో ముఖం చాటేశాడు. సినిమా రిలీజ్ కు ముందు తెగ ప్రమోట్ చేసిన ఆ హీరో రిలీజ్ తరవాత దాని ఊసెత్తడమే మానేశాడు. దీనికి కారణమేంటని ఆరా తీస్తే ఆ సినిమాలో కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ అదరగొట్టారని పేరొచ్చింది. తనకు పేరు రాలేదన్న ఉక్రోషంతో ఆ హీరో మొదటి నుంచి ప్రమోషన్స్ ను పట్టించుకోవడం మానేశాడు.

ఆ హీరో ఇలా చేయడం మొదటిసారేమీ కాదు. ఇంతకుముందు కూడా తాను నటించిన ఓ సినిమా ప్రమోట్ చేయకుండా వదిలేశాడు. తనతో కలిసి నటించిన యాక్టర్ తో తేడా కొట్టడంతో మొత్తం మూవీనే బహిష్కరించినంత పనిచేశాడు. ఎవరి మీద కోపమో సినిమా మీద చూపిస్తా ఎలా మహాశయా?