సినిమా ఔట్ పుట్ పై హీరో అసంతృప్తి?

0అతను ఒక బడా ఫ్యామిలీకి చెందిన హీరో. ఘనమైన వారసత్వంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆ హీరో కెరీర్ ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత కుదురుకున్నాడు. హీరోగా తనకంటూ ఇమేజ్.. మార్కెట్ సంపాదించుకున్నాడు. అతడి చివరి రెండు సినిమాలూ సూపర్ హిట్టయ్యాయి. కానీ తర్వాతి సినిమా రిలీజ్ కు చాలా గ్యాప్ వచ్చేసింది. కొంచెం అటు ఇటుగా రెండు క్రేజీ ప్రాజెక్టులు మొదలుపెట్టి దాదాపుగా ఒకేసారి వాటిని పూర్తి చేయాలని చూశాడు. కానీ అనివార్య కారణాలతో రెండూ ఆలస్యమయ్యాయి. ఇందులో ఒక సినిమాను విడుదలకు సిద్ధం చేసినా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో అనుకోని అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో సినిమా వాయిదా పడింది. చివరికి ఒక డేట్ ఎంచుకుని సినిమాను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

ఐతే చివర్లో హడావుడి వల్ల సినిమా ఔట్ పుట్ కొంచెం తేడా వచ్చిందని.. ఈ విషయంలో హీరో అసంతృప్తితో ఉన్నాడని అంటున్నారు. ఇటీవల ఎనిమిది రోజుల షెడ్యూల్లో హడావుడిగా ప్యాచ్ వర్క్ ఫినిష్ చేశారు. ఆ సన్నివేశాలు హీరోకు అసహనం తెప్పించాయట. దీనిపై అతను చిందులేశాడట. మరోవైపు ఈ చిత్ర సంగీత దర్శకుడు అందుబాటులో లేకపోవడంతో రీరికార్డింగ్ కు సంబంధించి కొంత వర్క్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో చేయిస్తున్నారట. దాని వల్ల సినిమాలో మ్యూజిక్ పరంగా కంటిన్యుటీ దెబ్బ తింటుందేమో అన్న భయాలు వెంటాడుతున్నాయి. మొత్తంగా ఈ సినిమాకు చివరి దశలో ఇలా ఏదో ఒక అడ్డంకి తలెత్తుతుండటంతో హీరో చాలా టెన్షన్ పడుతున్నాడని.. చిత్ర బృందంపై ఫ్రస్టేషన్ చూపిస్తున్నాడని అంటున్నారు. ఐతే ఎంటర్టైనర్లు తీయడంలో సిద్ధహస్తుడిగా పేరున్న దర్శకుడు మాత్రం ఏం టెన్షన్ అవసరం లేదని.. సినిమా బాగా ఆడుతుందని భరోసా ఇస్తున్నట్లు సమాచారం.