పవన్ కల్యాణ్‌తో దోస్తీకి జగన్ రెడీ..?

0


Jagan-and-pawanవైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎవరి మాటా వినరనే అభిప్రాయం బలంగా ఉంది. అయితే, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ఆయన దిగిరావడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అది కూడా ప్రశాంత్ కిశోర్ సలహా ఇవ్వడం వల్లనే అని అంటున్నారుట.

ఒంటరిగా పోటీ చేసే బలం వైసిపికి లేదని, పైగా అది తెలుగుదేశం పార్టీకి లాభిస్తుందని ప్రశాంత్ కిశోర్ జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీని ఓడించాలంటే మహా కూటమి ఏర్పాటు తప్ప మరో మార్గం లేదని ఆయన చెప్పినట్లు సమాచారం.

2019 ఎన్నికల్లో రాష్ట్రంలో తన విజయానికి తగిన వ్యూహాలు రూపొందించి అమలు చేయడానికి ప్రశాంత కిశోర్‌కు జగన్‌ మంచి ప్యాకేజీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో బీజేపీ-నరేంద్ర మోడీలకు, తర్వాత జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కుమార్‌కు, ఇటీవలి ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహరచనలో ఆయన సహకరించిన సంగతి తెలిసిందే.

జగన్మోహన్ రెడ్డితో కుదిరి ఒప్పందం మేరకు రంగంలోకి దిగిన ప్రశాంత్ కిశోర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు, ప్రజానాడిపై ప్రత్యేకంగా అధ్యయనం చేయించి ఓ నివేదికను జగన్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వివిధ పార్టీల మధ్య చీలిపోతే టిడిపి ప్రయోజనం పొందుతుందని ఆయన చెప్పినట్లు సమాచారం. టిడిపి తిరిగి అధికారంలోకి వస్తుందని కూడా ఆయన స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.

ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహా మేరకే పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేనతోను, ఇతర భావసారూప్య పార్టీలతోను కలిసి మహాకూటమి ఏర్పాటు చేయడానికి జగన్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్, ఇతర భావసారూప్య పార్టీలతో దోస్తీ కట్టాలని ప్రశాంత్ కిశోర్ తన నివేదికలో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా వైసీపీకి పూర్తి స్థాయిలో కలిసి వచ్చే అవకాశాల్లేవని ఆయన చెప్పినట్లు తెలిసింది.

పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతోందని,వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి స్వయంగా పోటీచేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారని, ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసగించిందని మండిపడుతున్నారని ప్రశాంత్ కిశోర్ గుర్తు చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్‌ ఇదే హోదా అంశాన్ని ఎన్నికల దాకా సాగదీసి.. దానినే ప్రచారాస్త్రంగా మలచుకుని మళ్లీ రాష్ట్రంలో వేళ్లూనుకోవాలని చూస్తోందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఈ రకంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మూడుగా చీలిపోయే అవకాశాలున్నాయని, ఇదే జరిగితే చంద్రబాబు మరోసారి సునాయాసంగా విజయం సాధిస్తారని ఆయన విశ్లేషించినట్లు తెలుస్తోంది.

మహా కూటమి ఏర్పాటు చేయాలని జగన్ ఆలోచిన వచ్చి అందుకు ప్రయత్నాలు ప్రారంభించినా అది అంత తేలికైనా విషయం కాదని అంటున్నారు. పవన్‌ కల్యాణ్ సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా వెళ్తున్నారు. యువతపై ఆయన పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ తప్పు పడుతున్నప్పటికీ పలు సందర్భాల్లో జగన్‌ పట్ల తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అందువల్ల, పవన్ కల్యాణ్ జగన్‌తో జత కడుతారా అనేది సందేహమే.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఇటీవలి దాకా పవన్ కల్యాణ్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తున్నారని, జగన్‌ ఏదైనా అంశంపై ఉద్యమం ప్రారంభించినప్పుడల్లా పవన్‌ను తెరపైకి తెచ్చి చంద్రబాబు తమ నేతకు రాజకీయ ప్రయోజనం చేకూరకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్‌ కాపు నేతకు పవన్‌తో కల్యాణ్‌తో మాట్లాడే బాధ్యతలను ఇప్పటికే అప్పగించినట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్‌తో జత కట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వామపక్షాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. పవన్ కల్యాణ్ కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు కనిపించారు. అయితే జగన్ విషయంలో మాత్రం సిపిఐ, సిపిఎం మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది.అవినీతి ఆరోపణలున్న నేపథ్యంలో జగన్‌ను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీపీఎం సానుకూలంగా వ్యవహరిస్తోంది.

రాష్ట్ర విభజనతో రాష్ట్రంలో చావుదెబ్బ తిన్న కాంగ్రెసు పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని ఆసరా చేసుకుని తిరిగి ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధపడుతోంది. జగన్ ప్రధాని మోడీని కలవడం వల్లనే కాకుండా పవన్ కల్యాణ్ క్షేతస్థాయిలో కార్యాచరణ చేపట్టకపోవడాన్ని ఆసరా చేసుకుని ప్రత్యేక హోదాపై ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెసు కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే గుంటూరులో రాహుల్ గాంధీ ఇతర జాతీయ పార్టీలతో కలిసి సభను నిర్వహించారు. జగన్‌పై అనుమానాలు కలిగించే విధంగా రాహుల్ గాంధీ ఈ సభలో మాట్లాడడం కూడా అందుకే.

పంజాబ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ప్రశాంత కిశోర్‌ వ్యూహాలు కీలక పాత్ర పోషించాయి. అంతకుముందు బిహార్‌లో బద్ధశత్రువులుగా ఉన్న నితీశ్‌కుమార్‌ (జేడీయే), లాలూప్రసాద్‌ యాదవ్‌ (ఆర్‌జేడీ), కాంగ్రెస్‌లను ఏకతాటిపైకి తెచ్చి విజయం సాధించి పెట్టిన ఘనత కూడా ప్రశాంత్ కిశోర్‌కు దక్కింది. ప్రధాని పగ్గాలు చేపట్టిన కొద్ది నెలలకే మోడీకి ఆ ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఆ రాష్ట్రంలో మహాకూటమి విజయం సాధించడానికి ఆయనే కారణం. ఇదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిహార్‌కు మించిన ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయనేది ప్రశాంత్ కిశోర్ భావన కావచ్చు.

ఇదే ఫార్ములా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అణుమాత్రం కూడా ప్రభావం చూపించలేదు. రాహుల్‌-సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌లను ఒక్కవేదికపైకి తీసుకురాగలిగినా యాదవ్‌-ముస్లిం ఓట్ల అండగా ఆ రెండు పార్టీలను అధికారంలోకి తేలేకపోయారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఫార్మూలా ఏ మేరకు పనిచేస్తుందనే భవిష్యత్తు మాత్రమే తేలుస్తుంది.