జగన్ ఎంపీల రాజీనామాలు ఆమోదం!

0ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడిని తెచ్చేందుకు వీలుగా ఏపీ విపక్షానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే.. వారి రాజీనామాల్ని లోక్ సభ స్పీకర్ ఆమోదించని వైనం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా స్పీకర్ ను కలిసి జగన్ పార్టీ ఎంపీలు తమ రాజీనామాల్ని ఆమోదించాలని కోరారు. అయితే.. రాజీనామాల ఆమోదంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయాన్ని ప్రకటించలేదు.

ఇప్పటికే పలుమార్లు తమ రాజీనామాల్ని ఆమోదించాలంటూ జగన్ పార్టీ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిసి తమ రాజీనామాల్ని ఆమోదించాలని పట్టుబట్టారు. ఈ రోజు ఉదయం మరోసారి స్పీకర్ ను కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ రాజీనామాల్ని ఆమోదించాలని పట్టుబట్టారు.

దీంతో.. ఆమె జగన్ పార్టీ ఎంపీల రాజీనామాల్ని ఆమోదించేందుకు అంగీకరించారు. స్పీకర్ ను కలిసి ఎంపీల్లో వైవీ సుబ్బారెడ్డి.. మేకపాటి రాజమోహన్ రెడ్డి.. వరప్రసాద్.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. వైఎస్ అవినాష్ రెడ్డిలు ఉన్నారు. ఏపీలోని పరిస్థితిని స్పీకర్ కు వివరించి.. తమ రాజీనామాల్ని ఆమోదించాల్సిందిగా కోరారు. దీంతో.. వారి రాజీనామాల్ని ఆమోదించనున్నట్లుగా స్పీకర్ వెల్లడించారు. దీంతో.. హోదా కోసం తమ పదవుల్ని తృణప్రాయంగా వదులుకున్న ఎంపీలుగా జగన్ పార్టీ నేతలు నిలిచిపోనున్నారు. ఎంపీల రాజీనామాల ఆమోదంపై అధికారిక ప్రకటన ఈ రోజు (బుధవారం) రాత్రికి రాజీనామాల ఆమోదానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం.