పాముకు నీళ్లుపోశారు..!

0కర్ణాటక: నీరు.. నోరున్న మనుషులకే కాదు.. నోరులేని మూగ జీవాలకు ప్రాణాధారం. కరవు పరిస్థితులు ఏర్పడితే అడవుల్లో ఉండే మూగ జీవాలు సైతం అల్లాడిపోతాయి. అందుకు విష సర్పలూ అతీతం కాదు. అలా తీవ్ర దాహార్తితో అల్లాడుతున్న ఓ త్రాచుపాముకు నీళ్లు తాగించి దాహం తీర్చారు అటవీశాఖ సిబ్బంది. నైరుతి కర్ణాటకలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నీటి జాడను వెతుక్కుంటూ ఏకంగా జనావాసాల్లోకి వచ్చిన ఓ త్రాచుపాముకు ఇక్కడి కైగి గ్రామస్థులు స్థానిక అటవీశాఖ సిబ్బందితో కలిసి దాహార్తిని తీర్చారు. ఓ బాటిల్‌లో నీళ్లు పట్టి పాముకు పట్టించగా, అది గటగటా తాగేసింది. అనంతరం దానిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. పాము నీరుతాగుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది.