Templates by BIGtheme NET
Home >> Cinema News >> నందమూరి బాలకృష్ణ ‘నర్తనశాల’ ట్రైలర్ విడుదల..!

నందమూరి బాలకృష్ణ ‘నర్తనశాల’ ట్రైలర్ విడుదల..!


నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభించిన ”నర్తనశాల” అనే పౌరాణిక చిత్రం అర్థాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ద్రౌపది పాత్రలో నటించిన హీరోయిన్ సౌందర్య ప్రమాదవశాత్తు మరణించడంతో బాలకృష్ణ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. అయితే అప్పటికే చిత్రీకరించిన సన్నివేశాలను దసరా కానుకగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేయడానికి బాలకృష్ణ నిర్ణయించుకున్నారు. 17 నిమిషాల సన్నివేశాలు గల బాలయ్య ‘నర్తనశాల’ను ఎన్బికె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘నర్తనశాల’ నుంచి అర్జునుడిగా బాలయ్య మరియు భీముడిగా దివంగత రియల్ స్టార్ శ్రీహరి.. ద్రౌపది పాత్రలో నటించిన దివంగత సౌందర్య లుక్ ని రిలీజ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్ర టీజర్ ని విడుదల చేశారు.

పాండవుల అజ్ఞాతవాసంలోని విరాటపర్వంలోని ఘట్టాన్ని ట్రైలర్ లో చూపించారు. ”ఈ అజ్ఞాతవాసం విజయవంతంగా ముగియవలెనన్న నాపైనే ఎక్కువ భారం ఉన్నది” అని అర్జునుడి పాత్రధారి బాలయ్య చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. అలానే ద్రౌపది పాత్రధారి సౌందర్య ‘పాండురాజు తనయులకు లేని కష్టం.. నాకా?’ అని చెప్తుంది. భీముడిగా నటించిన శ్రీహరి ‘రాచబిడ్డ నై పుట్టినందుకు ఆవేశం సగభాగం.. మీకు తమ్ముడిగా పుట్టినందుకు శాతం సగపాలు వచ్చినవి’ అని తన పాత్ర స్వభావాన్ని తెలియజేసాడు. ‘ఆనాడు ఊర్వశి ఇచ్చిన శాపం ఈనాడు నాపాలిట వరమైనది. ఇక మన దయాదులు ఎంతమంది వేగులను పంపినను.. వాళ్ళ పాచికలు పారవు.. ఎత్తుగడలు సాగవు’ అని అర్జునుడు చెప్తున్నట్లు ట్రైలర్ కట్ చేసారు. ‘ద్రౌపదీ సమేత మా పాండుకుమారుల తరపున మీకివే మా నమస్సుమాంజలలు’ అని చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుంది. ట్రైలర్ చూస్తుంటే గెటప్స్ పరంగా అందరూ సూట్ అయ్యారనే అర్థం అవుతోంది. అలానే చారిత్రక పౌరాణిక పాత్రల్లో అవలీలగా నటించే బాలయ్య అర్జునుడి పాత్రలో ఒదిగిపోయాడు. మొత్తం మీద ట్రైలర్ చూస్తే బాలయ్య తన స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తే బాగుండేది అనిపించకమానదు. 17 నిమిషాలు గల నందమూరి బాలకృష్ణ ‘నర్తనశాల’ అక్టోబర్ 24న ఉదయం 11.49 నిమిషాలకు శ్రేయాస్ ఈటిలో విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=cgUlBCD10ZM