థియేటర్లో సినిమా సీనైపోయిందన్న సురేష్ బాబు

0

డిజిటల్ రాక కొంప ముంచిందా? అంటే అవుననే ఆవేదన కనిపిస్తోంది. నెట్ ప్లిక్స్.. అమెజాన్ లాంటి డిజిటల్ మాధ్యమాలు సినిమాని నేరుగా ప్రేక్షకుడి మొబైల్స్ కే తీసుకొచ్చేసాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు కొత్త సినిమా నెల రోజుల్లో ముందుకొచ్చేస్తుంది. థియేటర్లో టిక్కెట్ కోసం క్యూ కట్టే పనిలేదు. ఆన్ లైన్ పుణ్యమా అని థియేటర్ క్యూలో పోలీసుల లాఠీ దెబ్బలు ఇప్పటికే తప్పాయి. సినిమా బిజినెస్ పరంగా నిర్మాతకు ఒక రకంగా డిజిటల్ లాభాలు తెచ్చిపెడుతున్నా వేరొక కోణంలో నష్టాలు తప్పడం లేదన్నది తెలిసిందే. సినిమాకు ముందే ఇలాంటి సంస్థలు పోటీపడటంతో నిర్మాత సేఫ జోన్ లోకి వెళ్లిపోతున్నా వేరొక కోణం భయపెట్టేస్తోంది.

డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థల వల్ల పంపిణీదారులు.. థియేటర్ యాజమాన్యాలు నష్టపోతున్నాయి అన్న మాట వాస్తవం. కేవలం పెద్ద హీరోల సినిమాలు తప్ప.. మిగతా హీరోల సినిమాల వైపు ఆడియన్స్ చూడటం లేదని చాలా కాలం వినిపిస్తోంది. ఇదే పరిస్థితిపై టాలీవుడ్ లో సరికొత్తగా విశ్లేషణ మొదలైంది. ఒకరకంగా ఆందోళన మొదలవుతోంది ఇప్పుడిప్పడే.

తాజాగా ఈ విషయంపై అగ్రనిర్మాత.. పంపిణీదారుడు కం ఎగ్జిబిటర్ డి. సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒకటి రెండు.. భారీ సినిమాలు చూడటానికే ప్రేక్షకుడు థియేటర్ కి వస్తున్నాడు. చిన్న సినిమాలు థియేటర్ లో చూడటం లేదు. అమెజాన్- నెట్ ప్లిక్స్ వల్ల పంపిణీదారులకు నష్టం భారీగానే ఉంటుందన్నారు. ఇప్పటికే థియేటర్లో సినిమా ఆడే సన్నివేశం లేదు. ఆడియన్స్ చాలా మారారు. ఇవి పాత రోజులు కాదు. స్టార్ హీరోల సినిమాలే రెండు రోజుల్లో ఖాళీ అయిపోతుందంటే ప్రస్తుత సినిమా పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు అని ఆయన అన్నారు. డిజిటల్ పై రెగ్యులర్ గా వస్తున్న `తుపాకి` ఎక్స్ క్లూజివ్ కథనాలకు తగ్గట్టే ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు విస్మయపరచడం ఆసక్తికరం.
Please Read Disclaimer