దగ్గుబాటి కాంపౌండ్ సినిమాలన్నీ ఓటీటీకేనా?

0

కరోనా క్రైసిస్ కష్టకాలంలో సినీనిర్మాతలు గట్టెక్కేదెలా? నష్టపోవడం తప్ప వేరే మార్గం లేదా? అంటే సినిమాల్ని థియేట్రికల్ రిలీజ్ కోసం ఆపడం కంటే ఓటీటీలలో రిలీజ్ చేయడమే బెటర్ అని భావిస్తున్న వాళ్లే ఎక్కువ. అందుకు అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు అతీతులేం కాదు. ఆయన తమ సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకే ఆసక్తిగా ఉన్నారు. మునుముందు పొంచి ఉన్న థర్డ్ వేవ్ భయాల నడుమ థియేటర్లను తెరిచినా కానీ జనం అంతగా రారని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఎవరు ఎన్నిరకాలుగా హెచ్చరించినా దగ్గుబాటి కాంపౌండ్ సినిమాలన్నిటినీ ఓటీటీలకు విక్రయిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొన్నటికి మొన్న ఓటీటీ రిలీజ్ కి స్కిప్ కొట్టి థియేట్రికల్ రిలీజ్ కోసం `నారప్ప` చిత్రాన్ని రెడీ చేస్తున్నారని ప్రచారమైంది. కానీ అంతలోనే వెంకీ నటించిన `నారప్ప` ఓటీటీ రిలీజ్ తేదీ ప్రకటించి షాకిచ్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో జూలై 20న నారప్ప ప్రసారం కానుంది. ఆ మేరకు అమెజాన్ ప్రైమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడడం షాకిచ్చింది. ఈ చిత్రం భారతదేశం సహా 200 పైగా దేశాలు భూభాగాలలో ప్రసారం కానుంది. వెంకీ నటించిన సీక్వెల్ మూవీ దృశ్యం 2 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కానుందని సమాచారం.

ఇక సురేష్ ప్రొడక్షన్ నుంచే వస్తున్న `విరాటపర్వం` డీల్ కోసం నెట్ ఫ్లిక్స్ తో మంతనాలు సాగిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒప్పందం దాదాపు ఖరారైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ పెండింగ్ చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇతర పనుల్ని ముగించేందుకు ప్రణాళికల్లో ఉన్నారు. రానా- సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుత సన్నివేశం చూస్తుంటే తెలంగాణ ఫిలింఛాంబర్ నియమావళి గురించి దగ్గుబాటి కాంపౌండ్ అంతగా వర్రీ అయినట్టు కనిపించడం లేదు. ఎగ్జిబిటర్ల బాధలను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు ఎవరూ తమ సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేయొద్దని ఇంతకుముందు తెలంగాణ ఫిలింఛాంబర్ హెచ్చరించింది. ఓటీటీలకు విక్రయిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రధాన కార్యదర్శి నారంగ్ హుకుం జారీ చేశారు. కానీ దానిని సురేష్ ప్రొడక్షన్స్ అంతగా పట్టించుకోలేదా? అందుకే ఓటీటీ రిలీజ్ ల వైపే మొగ్గు చూపుతోందా? అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

అయితే నారప్ప బాటలోనే దృశ్యం 2.. విరాటపర్వం చిత్రాలను ఓటీటీల్లో రిలీజ్ చేయనున్నట్టు దగ్గుబాటి కాంపౌండ్ ఇంకా ప్రకటించలేదు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాలి.

ఇక డి.సురేష్ బాబు బాటలోనే చాలా మంది నిర్మాతల్లో థర్డ్ వేవ్ భయాలు అలానే ఉన్నాయి. అందుకే ఓటీటీ మార్గం వైపు ఆలోచిస్తున్నారన్న గుసగుసలు ప్రస్తుతం వేడెక్కిస్తున్నాయి. నాని – టక్ జగదీష్ .. నితిన్ – మ్యాస్ట్రో లాంటి చిత్రాలు ఓటీటీ రిలీజ్ లను కాదనుకుని థియేట్రికల్ రిలీజ్ కోసం వేచి చూస్తున్నాయని ప్రచారమవుతోంది. కానీ మునుముందు సన్నివేశం ఎలా మారనుందో చూడాలి.