Templates by BIGtheme NET
Home >> GADGETS >> ఆ ఫీచర్‌తో రానున్న మొదటి వన్‌ప్లస్ ఫోన్ ఇదే.. ధర మాత్రం బడ్జెట్ లోనే!

ఆ ఫీచర్‌తో రానున్న మొదటి వన్‌ప్లస్ ఫోన్ ఇదే.. ధర మాత్రం బడ్జెట్ లోనే!


వన్ ప్లస్ త్వరలో తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ జెడ్ లేదా వన్ ప్లస్ నార్డ్ ను లాంచ్ చేయనుంది. ఇందులో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ తో లాంచ్ అయ్యే మొదటి వన్ ప్లస్ ఇదే కావడం విశేషం. తాజాగా లాంచ్ అయిన వన్ ప్లస్ 8 సిరీస్ ఫోన్ లో కూడా ఒక సెల్ఫీ కెమెరానే అందించారు. దీనికి సంబంధించిన టీజర్ పేజ్ ను కూడా అమెజాన్ వెబ్ సైట్ లో అందించారు.

32 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ఎడమవైపు పైభాగంలో ఈ రెండు కెమెరాలను అందించారు. రియల్ మీ ఎక్స్3 తరహాలో ఈ డిజైన్ ఉండనుంది. అయితే ఆండ్రాయిడ్ సెంట్రల్ రిపోర్ట్ అందించిన కథనం ప్రకారం ఇందులో ముందువైపు ఒక కెమెరానే ఉండనుంది.

2013 డిసెంబర్ లో వన్ ప్లస్ మొదటి ఫోన్ నుంచి సింగిల్ సెల్ఫీ కెమెరానే లాంచ్ చేస్తూ వచ్చింది. అయితే ఈ సంవత్సరం లాంచ్ అయిన వన్ ప్లస్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ లో రెండు సెల్ఫీ కెమెరాలు ఉంటాయని వార్తలు వచ్చినప్పటికీ సింగిల్ సెల్పీ కెమెరాతోనే లాంచ్ అయింది.

డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను పక్కన పెడితే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. 12 జీబీ వరకు ర్యామ్, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్ ను కూడా ఇందులో అందించనున్నారు.

అయితే వన్ ప్లస్ ఈ ఫోన్ గురించి ఇంతవరకు ఏమీ తెలపలేదు. పొరపాటున దీని గురించి వన్ ప్లస్ ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది కానీ వెంటనే డిలీట్ చేసింది. ఈ ఫోన్ వన్ ప్లస్ జెడ్ పేరుతో లాంచ్ అవుతుందని మొదట వార్తలు వచ్చాయి కానీ వన్ ప్లస్ నార్డ్ పేరిట లాంచ్ అయ్యే అవకాశం ఉంది.