గల్వాన్ లో చైనా సైనికుల మరణానికి సాక్ష్యం దొరికింది

0

భారత సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చిన డ్రాగన్ దేశ సైనికులకు మన సైనికులు ధీటుగా బదులివ్వటం.. ఈ ఉదంతంలో భారత్ కు చెందిన పలువురు సైనికులు వీర మరణం పొందటం తెలిసిందే. ఎలాంటి ఆయుధాలు లేని భారత సైనికుల మీద ఇనుప కమ్మీలున్న ఆయుధాలతో చైనా సైనికులు దాడికి పాల్పడటం తెలిసిందే. ఈ ఉదంతంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కల్నల్ తో పాటు పలువురు సైనికులు వీర మరణం పొందారు. తమపై దాడికి తెగబడిన డ్రాగన్ దేశ సైనికులకు బుద్ధి చెప్పటమే కాదు.. ఆ దేశానికి చెందిన సైనికులు ఎక్కువగానే మరణించారు.

దీనికి సంబంధించిన సమాచారాన్ని బయటకు పొక్కకుండా చైనా జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటివరకు ఈ ఉదంతంలో ఎంతమంది సైనికులు మరణించారన్న విషయాన్ని బయటపెట్టింది లేదు. ఇదిలా ఉండగా.. మరణించిన చైనా సైనికుడికి చెందిన సమాధి ఒకటి తాజాగా వెలుగు చూసింది. చైనాలోని సోషల్ మీడియాలో వచ్చిన ఈ సమాధి తాజాగా వైరల్ గా మారింది.

చైనాకు చెందిన చెన్ షియాంగ్రాంగ్ అనే పందొమ్మిదేళ్ల జవాను ఒకరు భారత సరిహద్దులో వీర మరణం పొందినట్లుగా ఆ సమాధి మీద మాండరిన్ భాషలో రాసి ఉన్నట్లు గుర్తించారు. భారత సైనికులతో జరిగిన దాడిలో మరణించిన సైనికులకు సంబంధించిన తొలి సాక్ష్యంగా దీన్ని చెప్పాలి. ప్రస్తుతం చైనా సోషల్ నెట్ వర్క్ అయిన వెయ్ బోలో ఈ సైనికుడి సమాధి ఫోటో వైరల్ గా మారింది.

దక్షిణ షిన్ జియాంగ్ సైనిక ప్రాంతంలో ఆగస్టు ఐదున ఈ సమాధి శిలను ఏర్పాటు చేసినట్లుగా సదరు ఫోటో చెబుతోంది. ‘‘పుజియాన్ లోని పింగ్నాన్ కు చెందిన 69316 యూనిట్ సైనికుడు చెన్ షియాంగ్రాంగ్ సమాధి ఇది. 2020 జూన్ లో భారత సరిహద్దు బలగాలతో జరిగిన ఘర్షణల్లో ప్రాణ త్యాగం చేశాడు. కేంద్ర సైనిక కమిషన్ ఆయన్ను మరణానంతరం స్మరించుకుంటుంది’’ అంటూ పేర్కొన్నారు. అయితే.. ఇది నిజమైన సమాధి కాదని.. ఫేక్ అన్న ప్రచారం సాగుతోంది. అయితే.. దీనిపై చైనా అధికారులు ఎవరూ ఇప్పటివరకూ స్పందించలేదు. తాజా పోస్టు.. చైనా దేశ సర్కారును ఇరుకున పెడుతుందన్న మాట వినిపిస్తోంది.