ఏపీలో పదో తరగతి – ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

0

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కష్టమైన సమయంలో తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ కూడా పరీక్షలు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. వీటితో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శనివారం ప్రకటించారు. మొదట ఎలాగైనా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని భావించగా ప్రస్తుతం రాష్ట్రంలో వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుండడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీంతో చివరకు పరీక్షల రద్దుకే మొగ్గు చూపింది. విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. దీంతో మొత్తం 6.3 లక్షల మంది విద్యార్థులు పాస్ కానున్నారు.

వైరస్ విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేయగా తాజాగా ఏపీ కూడా అదే నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సురేశ్ తెలిపారు. పరీక్షలు జాగ్రత్తగా నిర్వహించాలని పక్కా ప్రణాళిక చేశామని ఆన్లైన్లో క్లాస్లు చెప్పించామని పేపర్లను తగ్గించామని పరీక్షల కోసం అందరినీ సమన్వయం చేశామని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రద్దు చేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు వివరించారు.
ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్ధులను కూడా ఉత్తీర్ణులను చేస్తూ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ తీవ్రత దృష్ట్యా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు ఇచ్చే గ్రేడింగ్ విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని మంత్రి తెలిపారు.

వాస్తవంగా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం పది పరీక్షలు రద్దు చేసిన సమయంలో ఏపీలోనూ రద్దవుతాయని ప్రచారం జరగ్గా వాటిని ఏపీ ప్రభుత్వం కొట్టివేసింది. జూలై 10వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. చివరకు మారిన పరిస్థితుల నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం దృష్ట్యా పరీక్షలు రద్దు చేయక తప్పని పరిస్థితి.
Please Read Disclaimer