వయసు 19 ఏళ్లే.. ఆర్నెల్లలో రూ.80లక్షలు సంపాదించాడు

0

జీవితాంతం కష్టపడి ఈ బిల్డింగ్ సంపాదించానురా అంటే.. వావ్ అనుకునే రోజులు పోయి చాలానే రోజులయ్యాయి. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఎంతోమంది టైం పాస్ కోసం చేసే పనుల్ని కొందరు తెలివిగా తమ సంపాదనకు సాధనాలుగా మార్చుకుంటున్నారు. దీనికి నిలువెత్తు నిదర్శనం 19ఏళ్ల కుర్రాడి ఉదంతం.

కేవలం ఆరంటే ఆర్నెల్ల వ్యవధిలో ఏకంగా రూ.80లక్షలు సంపాదించిన ఇతగాడి సక్సెస్ స్టోరీ ఒక ఎత్తు అయితే.. ఇతగాడి తెలివి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. పక్కా బిజినెస్ మ్యాన్ గా అనిపించే ఇతగాడి ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ అతగాడి పేరు ఏమంటున్నారా? అక్కడికే వస్తున్నాం. అతగాడి పేరు అవినాష్ మాదా. ఇంతకీ ఈ కుర్రాడు ఏం చేశాడంటే..

చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా సోషల్ మీడియాలో టైం పాస్ చేయటానికి సోషల్ మీడియాను వాడేస్తుంటారు. అయితే.. అవినాష్ మాత్రం అందరిలా కాకుండా.. అందరూ సరదాగా టైంపాస్ చేసే సోషల్ మీడియాను తన బిజినెస్ ఫ్లాట్ ఫాంగా మార్చుకున్నాడు. ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఇన్ స్టాగ్రామ్ తో స్వల్ప వ్యవధిలోనే లక్షలాది రూపాయిల్ని సంపాదించాడు.

ఇన్ స్టాలోని తన పేజీలో మీమ్స్ వేసేవాడు. వాటికి చాలామంది కనెక్ట్ అయ్యేవారు. అతగాడి క్రియేటివిటీని చూసిన కొన్ని కంపెనీలు.. వారి ఉత్పత్తులను కూడా తమ ఇన్ స్టా పేజీలో ప్రమోట్ చేయాలని కోరాయి. అందుకు అతడు ఓకే చెప్పారు. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్స్ మొదలు బ్యూటీ ప్రొడక్ట్ ను మార్కెట్ చేసే పలు కంపెనీలు ఇతడ్ని అప్రోచ్ అయ్యాయి. అలా అతడి జర్నీ జోరుగా సాగటమే కాదు.. స్వల్ప వ్యవధిలో లక్షలాది రూపాయిలు సంపాదించాడు.

ఆర్నెల్లలో రూ.80లక్షలు సంపాదించిన ఇతను.. తన మాదిరి సోషల్ మీడియా వేదికగా చేసుకొని డబ్బులు సంపాదించాలనుకునే వారి కోసం ఆన్ లైన్ లో ఒక కోర్సును సిద్ధం చేశాడు. సోషల్ మీడియాతో డబ్బులు సంపాదించటం ఎలా అనే అంశానికి సంబంధించి వంద వీడియోల్ని సిద్ధం చేసిన అతను.. వాటిని చూడాలనుకునే ఒక్కొక్కరి వద్ద నుంచి 500 డాలర్లు నుంచి వెయ్యి డాలర్ల వరకూ వసూలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతగాడి వద్ద ఏడుగురు ప్రీలాన్స్ గా పని చేస్తున్నారట. త్వరలో హైదరాబాద్ లో కానీ విశాఖపట్నంలో కానీ ఆఫీసు ఓపెన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట. కుర్రాడెంత షార్ప్ గా ఉన్నాడో చూశారా?
Please Read Disclaimer