45 నిమిషాల ఆట కొంప ముంచింది.. మనసు తల్లడిల్లుతోంది: కోహ్లి

0

వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియాతో మాట్లాడాడు. భారత్ బ్యాటింగ్ ప్రారంభించాక.. తొలి 40 నిమిషాల్లో మ్యాచ్ మలుపు తిరిగిందన్నాడు. న్యూజిలాండ్ బౌలర్లు సరైన ప్రాంతాల్లో బంతులు విసిరారు. మొదటి 45 నిమిషాల్లోనే 3 వికెట్లు కూల్చి మాపై ఒత్తిడి పెంచారంటూ.. ప్రత్యర్థి బౌలర్లపై ప్రశంసలు గుప్పించాడు. గెలవడం కోసం అందరూ ఆడతారు. కానీ దురదృష్టవశాత్తూ నాకౌట్లో ఓడాం, ఓటమి బాధించిందని కోహ్లి తెలిపాడు.

టోర్నీలో మెరుగైన ఆటతీరే కనబర్చాం కానీ.. నాకౌట్లో 45 నిమిషాలు సరిగా ఆడకపోవడం హృదయాన్ని బద్దలు చేసిందన్నాడు. ఓటమిని విశ్లేషిస్తామన్న విరాట్.. రోహిత్, తాను అద్భుతమైన బంతులకు అవుటయ్యామన్నాడు. 240 పరుగుల ఛేజింగ్ కష్టం కాదనుకున్నాం. కానీ కివీస్ బౌలర్లు అద్భుతంగా బంతులేశారు, వారి ఫీల్డింగ్ బాగుంది. ఒత్తిడిలో మేం స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయామని అంగీకరించాడు.

రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య బాగా ఆడారన్న విరాట్.. కీలక సమయంలో ఔటైన పంత్‌కు అండగా నిలిచాడు. పంత్ వయసులో చిన్నోడు, అతడి వయసులో ఉన్నప్పుడు నేనెన్నో తప్పులు చేశాను. ప్రతిభావంతుడైన పంత్.. భవిష్యతులో నేర్చుకుంటాడని కోహ్లి భరోసా ఇచ్చాడు.

పరిస్థితులు బౌలింగ్‌కు అనుకూలించినప్పుడు.. న్యూజిలాండ్ బౌలర్లు చాలా ప్రమాదకరమన్న కోహ్లి.. జడేజా ఒత్తిడిలో అద్భుతంగా ఆడాడని ప్రశంసలు కురిపించాడు. నాకు జడేజా పదేళ్లుగా తెలుసన్న కోహ్లి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జడ్డూ ట్రిపుల్ సెంచరీలు బాదిన విషయాన్ని గుర్తు చేశాడు.
Please Read Disclaimer