కరోనా గురించి షాకింగ్ నిజాన్ని చెప్పిన వైరస్ ల వేటగాడు

0

పీటర్ పయోట్. పేరు విన్నంతనే.. ఎక్కడా విన్నట్లుగా అనిపించదు. నిజమే.. సామాన్యులకు ఆయన సుపరిచితుడు కాదు. కానీ.. భయంకరమైన వైరస్ ల మీద పరిశోధనలు చేసే వారికి.. ఆయనెంత మొనగాడో ఇట్టే తెలియటమే కాదు.. ఆయన చెప్పే విషయాల్ని ఎంతో శ్రద్దగా.. భక్తి తో వింటారు. ప్రపంచాన్ని వణికించిన ఎబోలా లాంటి వైరస్ ఆట కట్టించటంలో ఆయన కీలకభూమిక పోషించారు.

1949లో బెల్జియంలో పుట్టిన ఆయన 1976లొ ఎబోలా వైరస్ ను కనుగొనటంతో కీలకభూమిక పోషించటమే కాదు.. వైరస్ ల అంతు చూడటంలో ఆయనకు మించినోళ్లు చాలా తక్కువమంది మాత్రమే ప్రపంచంలో ఉంటారని చెబుతారు. అందుకే ఆయన్ను.. వైరస్ ల వేటగాడుగా అభివర్ణిస్తుంటారు. ఎబోలా.. ఎయిడ్స్ నియంత్రణ మీద పరిశోధనలు చేస్తుంటారు. ఆరోగ్య.. ఔషధ రంగంలో ఎన్నో పురస్కారాల్ని సొంతం చేసుకున్న ఆయన.. ప్రస్తుతం లండన్ లో పని చేస్తున్నారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి తాజాగా ఆయన పలు ఆసక్తికర విషయాలు చెప్పటమేకాదు.. కరోనా ఎంత భయంకరమైన వైరస్ అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ప్రాణాల్ని తీసే గుణం తక్కువే ఉన్నా.. ప్రాణం పోయేంత బాధను.. తన దెబ్బతో ఇట్టే ప్రపంచాన్ని చుట్టేసే సత్తా దానికి ఎంత ఉందన్న విషయాన్ని అర్థం కావాలంటే ఆయన మాటల్ని వింటే చాలు.. విషయం ఇట్టే అర్థమైపోతుంది.

కరోనా వైరస్ కంటికి కనిపించదన్న విషయం అందరికి తెలిసినా.. అదెంత సూక్ష్మంగా ఉంటుందన్న విషయాన్ని ఆయన చెప్పినంత బాగా మరెవరూ చెప్పలేరేమో. కరోనా వైరస్ కుటుంబంలో కోవిడ్ -19 అత్యంత సూక్ష్మమైన వైరస్ గా చెబుతారు. ఒక నూడుల్ లాంటి చిన్న పోగును ఒక బంతిలో ప్యాక్ చేసినట్లుగా ఉంటుందని చెబుతారు. అంతా ప్రోటీన్ తో తయారై ఉంటే.. ఈ వైరస్ ను చూస్తే.. సూర్యుడి బాహ్యవలయం కరోనా మాదిరిగా కనిపిస్తుందని చెబుతారు. ఈ జాతి వైరస్ లు ఇంచుమించు ఇలానే కనిపిస్తాయని చెబుతారు.

ఈ వైరస్ ఎంత చిన్నదంటే.. ఒకసారి దగ్గితే గాల్లోకి వచ్చే తుంపరల్లోఈ వైరస్ లు కొన్ని వందల కోట్లలో ఉంటాయని చెబుతారు. ఒక సూదిమొనపైన పది కోట్ల వరకూఈ వైరస్ లు ఉంటాయంటే.. ఇదెంత సూక్ష్మాతిసూక్ష్మమైనదో ఇట్టే అర్థమైపోతుంది. అలాంటి వేళ.. ప్రపంచాన్ని వాయి వేగం తో చుట్టేయటం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. మనిషి నుంచి మనిషికి మొత్తం ఏడు రకాల వైరస్ లు సోకుతుంటాయని.. వాటిల్లో నాలుగు ప్రమాదకరమైనవి కావని చెబుతారు. వీటి వల్ల కొంచెం జలుబు వచ్చి పోతుందని.. మిగిలిన మూడు మాత్రం చాలా డేంజర్ అని చెబుతారు. ఆ మూడింటిలో ఒకటి సార్స్.. రెండోది మెర్స్.. మూడోది ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ -19 గా చెబుతారు. ఇప్పుడు అర్థమైందా? మనం ఎంతటి శక్తివంతమైన.. సూక్ష్మాతిసూక్ష్మమైన శత్రువుతో యుద్ధం చేస్తున్నామో?
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-