మహిళా తహసీల్దార్ ఇంట్లో నోట్ల కట్టలు.. రూ.93లక్షలు సీజ్ చేసిన ఏసీబీ

0

రెండేళ్ల క్రితం ఉత్తమ తహసీల్దార్‌గా ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్న అధికారిణి ఇంట్లో నోట్ల కట్టలు దాచి ఏసీబీకి చిక్కారు. లంచం సొమ్ము తీసుకుంటుండగా చిక్కిన వీఆర్వో ఇచ్చిన సమాచారం ఆధారంగా తహసీల్దార్ ఇంట్లో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు అక్కడ బయటపడిన నోట్ల కట్టలు చూసి నోరెళ్లబెట్టారు. పట్టుబడిన నగదు ఏకంగా రూ.93లక్షలుగా నిర్ధారించారు. ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో ఇంత భారీస్థాయిలో నగదు పట్టుబడటం ఇదే పదేళ్లలో ఇదే తొలిసారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం దత్తాయపల్లికి చెందిన మామిడిపల్లి భాస్కర్ అనే రైతు తన 9.07 ఎకరాల పొలానికి కేటాయించిన నంబర్ సర్వేల్లో లేదని, దాన్ని సవరించాలని కోరుతూ కొద్ది నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. కొందుర్గు వీఆర్వోగా పనిచేసే అనంతయ్య రూ.8లక్షల లంచం ఇస్తే పని చేస్తానంటూ భాస్కర్‌ను వేధిస్తున్నాడు. తనకు రూ.5లక్షలు, తహసీల్దార్ లావణ్యకు రూ.3లక్షలు ఇస్తే పని వెంటనే పూర్తయిపోతుందని చెప్పాడు. ప్రభుత్వ పరంగా చేసే పనికోసం లంచం ఎందుకు ఇవ్వాలని తనని తానే ప్రశ్నించుకున్న భాస్కర్ ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు చెప్పినట్లుగా బుధవారం తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లి వీఆర్వో అనంతయ్యకు రూ.4లక్షలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అయితే దీనితో తనకు సంబంధం లేదని తహసీల్దార్ లావణ్య ఆదేశాల మేరకు తాను లంచం తీసుకుంటున్నట్లు అనంతయ్య చెప్పడంతో హయత్‌నగర్‌ శాంతి నగర్‌లో ఉంటున్న ఆమె ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఇంట్లో ఎక్కడ చూసినా రూ.2000, రూ.500 నోట్ల కట్టలు బయటపడటంతో అంతా షాకయ్యారు. మొత్తం రూ.93లక్షల నగదు బయటపడగా దానికి తహసీల్దార్ లెక్కలు చెప్పలేకపోయారు. దీంతో నగదుతో పాటు 40 తులాల బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లావణ్యతో పాటు వీఆర్వో అనంతయ్యపైనా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Please Read Disclaimer