సాయాజీ షిండే సమయస్ఫూర్తి.. అడవి తగలబడకుండా ఆపిన నటుడు

0

సాయాజీ షిండే.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. తన పాత్రలకు తానే స్వయంగా డబ్బింగ్ చెబుతూ ప్రత్యేకత చాటుకున్నారు. ఇప్పటి వరకు తెలుగులో 75కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. చివరిగా నందమూరి బాలకృష్ణ ‘రూలర్’ సినిమాలో ఆయన కనిపించారు. తెలుగు సినిమాల్లోనే కాకుండా హిందీ, మరాఠి, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఆర్టిస్టుగా ఉన్నారు.

ఇదిలా ఉంటే, సినిమాలతో బిజీగా ఉండే సాయాజీ షిండే సమాజం పట్ల చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రకృతిపై ఆయన ఎంతో ప్రేమ. అడవులను కాపాడుకోవాలని ఎప్పుడూ చెబుతూ ఉంటారాయన. అయితే, షిండే ఆదివారం మహారాష్ట్రలోని పుణే శివార్లలో ఉన్న కాట్‌రాజ్ ఘాట్ రోడ్డులో కారులో వెళ్తుండగా అడవి తగలబడటం చూశారు. వెంటనే కారు ఆపి రంగంలోకి దిగారు. అక్కడి కొన్ని తుప్పలు విరిసి వాటితో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఆయనకు కార్పోరేటర్ రాజేష్ బరాతే సహాయం చేశారు. ఇద్దరూ కలిసి కష్టపడి ఆ మంటలను అదుపు చేశారు. మంటలు మరింత వ్యాపించి తీవ్ర నష్టం జరగకుండా ఆపారు.


సాయాజీ షిండే మంటలను ఆర్పుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నలుపు రంగు ప్యాంట్, బూడిద రంగు షర్ట్ వేసుకున్న సాయాజీ షిండేను చూడొచ్చు. ఆయన కొన్ని తుప్పలను చేతితో పట్టుకుని మంటలను ఆర్పుతున్నారు. వేసవి కాలం వచ్చిందంటే అడవిలో మంటలు చెలరేగుతుంటాయి. అంతేకాదు, ఆ మంటలు చాలా వేగంగా వ్యాపిస్తుంటాయి. ఒకవేళ సాయాజీ షిండే ఆగకుండా వెళ్లిపోయుంటే ఆ మంటలు ఇంకెంత వ్యాపించేవో. ఆయనలానే ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. హ్యాట్సాఫ్ షిండే సార్.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-