చట్టం లేటు: రూ.20 దొంగతనానికి 41 ఏళ్లకు తీర్పు!

0

మన చట్టాలు ఎంత దుర్లభంగా ఉన్నాయో చెప్పే సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. వంద మంది నేరస్థులు తప్పించుకున్నా పర్వాలేదు.. కానీ ఒక నిర్ధోషికి మాత్రం శిక్ష పడవద్దంటారు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి 20 రూపాయలు దొంగతనానికి 41 ఏళ్లుగా తీర్పు రాకుండా అతడు నెలలపాటు కటకటాల్లో చిక్కుకున్న సంఘటన ఒకటి వెలుగుచూసింది.

అది 1978వ సంవత్సరం.. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ప్రాంతం. బాబూలాల్ అనే వ్యక్తి బస్సులో ప్రయాణిస్తున్నాడు.కండక్టర్ నుంచి టకెట్ కొనుగోలు చేసే సమయంలో అతడి జేబులోని 20 రూపాయలను ఇస్మాయిల్ అనే వ్యక్తి దొంగతనం చేసినట్టు గుర్తించాడు. బాబూలాల్ అప్పుడు తన 20 రూపాయలు ఇస్మాయిల్ కొట్టేశాడని కేసు పెట్టాడు. ఇప్పుడు 20 రూపాయలు చీప్ కానీ అప్పుడు రూ.20 అంటే 5000 రూపాయలపైగానే మొత్తంతో సమానం.. అయితే పోలీసులు కేసు నమోదు చేసి ఇస్మాయిల్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కొద్దినెలల పాటు జైలు శిక్ష అనుభవించిన ఇస్మాయిల్ బెయిల్ పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు హాజరువుతున్నాడు. ఇప్పుడు కేసుపెట్టిన బాబూలాల్ వయసు 64 ఏళ్లు కాగా.. ఇస్మాయిల్ ది 60 ఏళ్లు.

అయితే 2004 నుంచి ఇస్మాయిల్ కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో అతడిపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేయించింది. దీంతో 20 రూపాయల కేసుకు ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఇస్మాయిల్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే కడు పేదరికం కావడంతో కుటుంబసభ్యులు ఇస్మాయిల్ ను పట్టించుకోలేదు. బెయిల్ ఇప్పించలేదు. దీంతో వృద్ధుడైన ఇస్మాయిల్ జైల్లోనే మగ్గుతున్నాడు.

తాజాగా లోక్ అదాలత్ లో 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ కేసును ఓ మెజిస్ట్రేట్ చూసి జాలిపడ్డాడు. ఇస్మాయిల్ తో మళ్లీ దొంగతనం చేయబోనని హామీ పత్రం రాయించుకొని వదిలిపెట్టారు. ఇలా రూ.20 కేసు.. 40 ఏళ్లకు ఓ బాధితుడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించి బయటపడ్డాడు. మన చట్టాల్లోని లొసుగులు జాప్యం ఏ స్థాయిలో ఉందనడానికి ఈ కేసే గొప్ప ఉదాహరణగా న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
Please Read Disclaimer