జ్వరమొస్తేనే కరోనా కాదు.. ఎయిమ్స్ స్టడీలో షాకింగ్ విషయాలు

0

విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్.. ఇలా ప్రతి చోటా థెర్మో మీటర్లతో శరీర ఉష్ణోగ్రతలను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. జ్వరంతో శరీరం వేడెక్కితే కరోనా అనే అనుమానంతో వారికి ప్రవేశం కల్పించడం లేదు. అక్కడి నుంచి అటే క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. దీనిపై ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నిర్వహించిన స్టడీలో షాకింగ్ విషయాలు తెలిశాయి.

కరోనా వైరస్‌కు జ్వరాన్ని ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ప్రయోజనం లేదని స్పష్టం చేసింది. వాస్తవానికి కరోనా వైరస్ సోకితే.. జ్వరం, పొడి దగ్గు, అలసట, గొంతు నొప్పి వస్తాయనే సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల అలాంటి లక్షణాలు లేనివారిలో కూడా కరోనా ఉన్నట్లు నిర్ధరణ అవుతోంది. ఫలితంగా.. వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది.

కరోనా వైరస్ లక్షణాలపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం మార్చి 23 నుంచి ఏప్రిల్ 15 వరకు స్టడీ నిర్వహించింది. దీనికి సంబంధించిన వివరాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (IJMR)లో ప్రచురించారు. ఎయిమ్స్‌లో చేరిన 144 మంది వైరస్ బాధితుల్లో లక్షణాలను పరిశీలించగా.. కేవలం 17 శాతం మందికి మాత్రమే జ్వరం వచ్చిందని తేలింది. వీరిలో ఎక్కువ మందికి స్వల్పంగా శ్వాస సంబంధ సమస్యలు, గొంత నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపించాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. థెర్మో టెస్టులతో బాడీ హీట్‌ను పరిశీలించడం వల్ల ఫలితం ఉండదని అర్థమవుతుంది. కాబట్టి.. ప్రజలు వీలైనంత వరకు బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం.