అందంతో ఎరేసి, రిసార్టుకు పిలిపించి.. హైదరాబాద్‌లో ఎయిర్ హోస్టెస్ మోసం

0

తనకు వరంలా ఉన్న అందాన్ని ఎరగా వేసి ఓ ఎయిర్‌ హోస్టెస్ కోట్లకు పడగలెత్తాలనుకుంది. కట్టుకున్న భర్తతో కలిసి భారీ స్కెచ్ వేసింది. పక్కాగా ప్లాన్ అమలు చేసింది. వ్యాపారిని బుట్టలో పడేసి రూ.10 లక్షలు కాజేసింది. అంతటితో ఆపితే మరోలా ఉండేది! కానీ, అత్యాశకు పోయి అతడి నుంచి కోటి రూపాయలు కొట్టేయడానికి మరో స్కెచ్ వేసింది. అదే ఆమె కొంపముంచింది. బాధితుడి ఫిర్యాదుతో ఆ భార్యాభర్తలిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో కలకలం రేపిన హనీట్రాప్ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..

బారెడు కళ్లు.. లేలేత చెక్కిళ్లు.. చక్కటి ముఖ సౌందర్యం.. చూడగానే కట్టిపసే అందం.. ఎయిర్‌ హోస్టెస్‌ కనిష్క సొంతం. అయితే ఆమె తన అందాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా సంపాదించాలనుకుంది. దానికి భర్త నుంచి సహకారం కూడా అందడంతో రెచ్చిపోయింది.

హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న కనిష్క.. శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తోంది. ఏడాది కిందట ఓ యువకుడితో ఆమెకు వివాహమైంది. అటు ఆమె సంపాదన, ఇటు భర్త జీతభత్యాలతో కాపురం హాయిగా గడిచిపోతోంది. విలాసవంతమైన జీవితం కోసం అడ్డదారులు తొక్కడం వారిని కటకటాల పాలు చేశాయి.

ఇటీవల హనీట్రాప్ ఘటనల గురించి చదివిన కనిష్క.. అలాగే తానూ ఎందుకు చేయకూడదు అనుకుంది. భర్త తోడ్పాడుతో వెంటనే తన ప్లాన్ అమల్లో పెట్టింది. అందంగా ముస్తాబై ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిగా భ్రమించేలా ఫోటోలు దిగింది. తన అందచందాలతో ఓ వ్యాపారిని బుట్టలో వేసుకుంది.

ఆన్‌లైన్‌లో కనిష్క ఫోటోలు చూసిన ఓ వ్యాపారి ఆమెతో మెల్లిగా మాటలు కలిపాడు. ఈ క్రమంలో ఆమె ఓ బిజినెస్ ప్లాన్ గురించి చెప్పింది. అందులో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా వ్యాపారిని కోరింది. సదరు బిజినెస్‌పై చర్చించడానికి ప్రతినిధులు వస్తున్నారంటూ ఆయణ్ని హైదరాబాద్‌కు పిలిపించింది. రిసార్ట్‌లో కొన్ని గదులు బుక్ చేయించింది.

కనిష్క మాటలు నమ్మి సదరు వ్యాపారి ఆమె చెప్పిన రిసార్టుకు వచ్చాడు. అక్కడ ఆమె తప్ప ఎవరూ లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. అతడిని మాటల్లో పెట్టిన కనిష్క మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చింది. ఇక అసలు డ్రామా మెదలు పెట్టి భర్తను పిలిపించింది.

వ్యాపారి తనతో ఏకాంతంగా గడుపుతున్నట్లు అందరినీ నమ్మించే విధంగా ఫోటోలకు ఫోజిచ్చింది. కనిష్క అతడితో సన్నిహితంగా ఉన్నట్లు నటించగా ఆమె భర్త ఆ దృశ్యాలను అందంగా చిత్రీకరించాడు. ఆపై అతడు ఆ వ్యాపారి కణతకు డమ్మీ రివాల్వర్ గురిపెట్టి వాళ్ల రాసలీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని నిలదీసినట్లు ఫోజిచ్చాడు.

ఆ ఫోటోలు చూపెట్టి వ్యాపారిని బెదిరించారు. వ్యాపారం పేరుతో పత్రం రాయించుకొని రూ. 10 లక్షలు వసూలు చేశారు. బాధిత వ్యాపారి పది లక్షల రూపాయలతో పోతుందనుకుంటే.. వారి వేధింపులకు అదుపు లేకుండా పోయాయి ఆ ఫోటోలను మీడియాకు విడుదల చేస్తామని బెదిరించి.. కోటి రూపాయలు డిమాండ్ చేశారు. బాధితుడు చేసేదేంలేక పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు. కనిష్క అమలు చేసిన హనీట్రాప్ సూత్రం ద్వారానే ఆ కిలాడీ దంపతులను పట్టుకున్నారు. గురువారం (అక్టోబర్ 31) వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ భార్యాభర్తలు ఓ ఎన్నారైని కూడా ఇలాగే మోసం చేసినట్లు తెలుస్తోంది. వారిని విచారించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.Please Read Disclaimer