మన ఇండియా వన్ ప్రత్యేకతలు ఇవే

0

ఎంతోకాలంగా ఎదురుచూసిన రోజు వచ్చేసింది. 130 కోట్ల ప్రజలున్న దేశానికి కీలకమైన రాష్ట్రపతి.. ప్రధానమంత్రి ప్రయాణించే విమానాలు అత్యాధునికమైనవి కాకపోవటం లోటుగా చెప్పక తప్పదు. చాలామంది చెప్పినట్లు.. భారతీయులు పేదవారు కాదు.. భారతదేశం మాత్రమే పేదదన్నది నిజం. మన దేశ లోగిళ్లలో పోగుపడిన బంగారం.. ఇతర ఆస్తులు.. నల్లధనం బయటకు రావాలే కానీ.. ప్రపంచంలో ఏ దేశం మాత్రం మనతో పోటీ పడగలదు. నిలువెత్తు అవినీతి.. పాలకల్లో కనిపించని కమిట్ మెంట్.. వారిని ఎన్నుకునే ఓటర్లలో లేని ముందుచూపు.. మొత్తంగా దేశం ఇప్పుడున్న దుస్థితికి కారణాలుగా చెప్పక తప్పదు.

ఇంత పెద్ద దేశానికి కీలకమైన వ్యక్తులు ప్రయాణించే విమానం అత్యాధునికంగా ఉండాలన్న కల నేటితో నెరవేరిందని చెప్పాలి. తాజాగా రెండు అత్యాధునిక విమానాల్ని కొనుగోలు చేయటం.. అవికాస్తా దేశానికి చేరుకోవటం తెలిసిందే. గడిచిన పాతికేళ్లుగా బోయింగ్ 777 విమానాన్ని వాడే రాష్ట్రపతి.. ప్రధానమంత్రులు.. ఇకపై ఈ అత్యాధునిక విమానాన్ని వినియోగించనన్నారు.

ప్రత్యేకంగా డిజైన్ చేయటంతోపాటు..క్షిపణి దాడుల్ని సైతం తట్టుకునే సామర్థ్యం దీని సొంతం. రెండు విమానాల్ని కొనుగోలు చేయగా.. మొదటి విమానం నిన్న వస్తే.. రెండో విమానం మరో రెండు..మూడు రోజుల్లో దేశానికి చేరుకోనుంది. విమానం మీద భారత్ అనే అక్షరాలు చూడముచ్చటగా ఉండటమే కాదు.. అశోక చక్రం కన్నుల పండువ చేసేలా ఉన్నాయి. చూసినంతనే ఆకట్టుకునేలా ఉన్న ఈ భారీ విమానంలో ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి చూస్తే..

– అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్సు వన్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఎయిర్ ఇండియా వన్ విమానం ఉండనుంది.
– ఈ విమానానికి క్షిపణి దాడుల్ని ఎదుర్కొనే రక్షణ వ్యవస్థ ఉంది
– లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ఫేర్డ్ కైంటర్ మెజర్స్.. సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ ను అమర్చారు.
– గంటకు 900 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది
– అమెరికా – భారత్ మధ్య ప్రయాణం కోసం మధ్యలో ఇంధనాన్ని నింపాల్సిన అవసరం లేదు. ఎక్కడా ఆగకుండానే ప్రయాణించే భారీ సామర్థ్యం దీని సొంతం.
– ప్రస్తుతం వినియోగిస్తున్న విమానాల్లో పది గంటలకు ఇంధనాన్ని నింపాల్సిన అవసరం ఉంది.
– ఈ రెండు విమానాల కోసం రూ.8400 కోట్లు ఖర్చు చేశారు
– విమానంలోనే ప్రధాని కార్యాలయం.. సమావేశాల నిర్వహణకు పెద్ద హాలు ఉంటుంది.
– పూర్తిస్థాయి ఫ్లయింగ్ కమాండ్ సెంటర్ మాదిరి పని చేసే సత్తా దీని సొంతం.
– ఈ విమానాల్ని ఎయిరిండియా పైలెట్లు నడపరు. భారత వాయుసేనకు చెందిన పైలెట్లు నడుపుతారు.
– శత్రువుల రాడార్ ఫ్రీక్వెన్సీని జామ్ చేయగలదు
– క్షిపణుల్ని దారి మళ్లించే సత్తా దీని సొంతం.