అచ్చెన్నకు చికిత్స చేసిన డాక్టర్లకు కరోనా: ఆలపాటి రాజా

0

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో గుంటూరులో జీజీహెచ్‌ను పరిశీలించారు మాజీ మంత్రి, టీడీపీ నేత ఆలపాటి రాజా. ఆదివారం ఆస్పత్రిని పరిశీలించిన ఆయన… జీజీహెచ్‌లో కరోనా కలకలంపై ఆరా తీశారు. ఆస్పత్రిలో ఓ వైపు కరోనా కేసులతో పాటు.. మరోవైపు నాన్ కోవిడ్ కేసులకు కూడా చికిత్స అందిస్తున్నారని ఆరోపించారు. కరోనా పేషంట్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్లే ఇతర రోగులకు కూడా వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. దీని వల్ల ఇతర రోగులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉందన్నారు. ఓ తల్లి కూతురుకు ఈ విధంగానే కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. దీంతో ఆస్పత్రికి రోగులు రావాలంటేనే భయపడుతున్నారన్నారు ఆలపాటి.

అచ్చెన్నాయుడుకి రెండు వారాల పాటు గుంటూరు జీజీహెచ్‌లోనే ఉంచి చికిత్స అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అచ్చెన్నకు వైద్యం చేసిన వైద్యులకు కూడా కరోనా సోకిందన్న వార్తలు వస్తున్నాయని ఆలపాటి రాజా పేర్కొన్నారు. అచ్చెన్నకు వైద్యం చేసిన సిబ్బంది రిపోర్టును తక్షణమే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అచ్చెన్న ఆరోగ్యంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కనీసం అచ్చెన్నను కుటుంబసభ్యులు కూడా కలిసేందుకు అనుమతి ఇవ్వలేదని ఆలపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్న ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆస్పత్రి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు ఆలపాటి.
Please Read Disclaimer