అమరావతిలో జన జాతర.. రాజధాని రైతుల భారీ ప్రదర్శన

0

రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌తో పలు గ్రామాల ప్రజలు కదంతొక్కారు. రాజధాని ప్రాంతంలో 43వ రోజు ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. అమరావతి జేఏసీ పిలుపు మేరకు తుళ్లూరు నుంచి మందడం వరకు చేపట్టిన భారీ వాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు, రైతు కూలీలు, మహిళలు పాల్గొన్నారు. కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లతో వేలాదిగా జనం ఈ ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు.

ఎండను సైతం లెక్క చేయకుండా..

ఎండను సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని రైతులు తేల్చిచెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు రైతులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు.

29 మీదుగా ప్రదర్శన

రాజధాని పరిధిలోని 29 గ్రామాల మీదుగా ప్రదర్శన కొనసాగింది. రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, మోదు లింగాయపాలెం, వెలగపూడి, మల్కాపురం, మందడం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ, పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, హరిచంద్రపురం, బోరుపాలెం, దొండపాడు గ్రామాల మీదుగా ప్రదర్శన తిరిగి తుళ్లూరు చేరుకుంది.

సీఎం జగన్ కళ్లు తెరవాలి: లోకేశ్

అయితే ఈ ర్యాలీకి సంబంధించిన వీడియోను టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. రాజధాని రైతుల మహా ప్రదర్శన చూసైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కళ్లు తెరవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. నా రాజధాని అమరావతి, ఏపీ విత్ అమరావతి అనే హ్యాష్ ట్యాగ్‌లు జోడించారు.

‘పాలకపక్ష నేతలవి మతిలేని మాటలు’

రాజధాని రైతుల బైక్ ర్యాలీపై తెలుగు దేశం పార్టీ ట్వీట్ చేసింది. ‘‘కళ్లు మూసుకుపోయి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్న పాలకపక్ష నేతలు ప్రజల ఆకాంక్షలను నిర్దాక్షిణ్యంగా అణిచేయడానికి మతి లేని మాటలేవో మాట్లాడుతున్నారు. ప్రజలు పోరాటం చేస్తుంటే కృత్రిమ ఉద్యమమంటూ కారుకూతలు కూస్తున్న వైసీపీ నేతలూ చెప్పండి.. దండులా కదిలిన ఈ వాహన శ్రేణి కృత్రిమమా?’’ అని ట్వీట్ చేసి వీడియోను జోడించింది.
Please Read Disclaimer