మన్ కీ బాత్ లో అమరావతి ఇష్యూ..ప్రధాని హాట్ లైన్ కు ఫోన్ల వెల్లువ

0

దేశ ప్రజలతో మాట్లాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం గురించి తెలిసిందే. ఆల్ ఇండియా రేడియో – డీడీ నేషనల్ – డీడీ న్యూస్ ద్వారా ఆయన ప్రజలతో మాట్లాడుతారు. ఆయన ఏ అంశంపై మాట్లాడాలో కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక నంబర్లుంటాయి. ఆ నంబర్లకు ఫోన్ చేసి ప్రజలు సలహాలు ఇవ్వొచ్చు. అయితే… ఇప్పుడు తెలుగు నేలపై జరుగుతున్న ఓ కీలక ఉద్యమంపై ప్రధాన సమస్యపై మాట్లాడాలంటూ మన్ కీ బాత్ నంబర్లకు ఫోన్లు వెల్లువెత్తుతున్నాయట.

ఏపీ రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత మూడు వారాలుగా అమరావతి రైతులు నిరసనలు – ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు – వారి కుటుంబసభ్యులు ప్రధాని మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఫోన్లు చేశారు. రాజధాని అమరావతిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధాని కోసం భూములను త్యాగం చేశామని తమను ఆదుకోవాలని విన్నవించుకున్నారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రధాని దృష్టికి వెళితే – కేంద్రం నుంచి ఏదైనా నిర్ణయం వెలువడుతుందని రైతులు భావిస్తున్నారు.

కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ ప్రభుత్వం నుంచి తమకు కలుగుతున్న నష్టాన్ని ఆపాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగా ప్రధాని దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు ఈ మార్గం ఎంచుకున్నారు. అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీయే శంకుస్థాపన చేయడంతో ఆ విషయం గుర్తు చేస్తూ ఏపీ నుంచి వేల సంఖ్యలో కాల్స్ వెళ్లాయట.
Please Read Disclaimer