మోహన్‌బాబు డైలాగ్‌తో రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే.. ఓ రేంజ్‌లో విమర్శలు

0

టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్. చంద్రబాబు అసాంఘిక శక్తిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బెంజ్ సర్కిల్‌లో చంద్రబాబు అరెస్టుపై ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వెంట అనుచరులు మినహా అమరావతి రైతులెవరూ లేదని ఆయన అన్నారు. అమరావతి జేఏసీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అది అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ కాదని.. జాయింట్ యాక్టింగ్ కమిటీ అని ఎద్దేవా చేశారు.

విశాఖలో రాజధాని ఏర్పాటును వ్యతిరేకించడంపై అమర్నాధ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ నుంచి విశాఖ 400 కిలోమీటర్ల దూరం ఉందని పదేపదే చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. విజయవాడ నుంచి విశాఖకు నాలుగొందల కిలోమీటర్లు ఉంటే.. విశాఖ నుంచి విజయవాడకు 4 కిలోమీటర్లు ఉంటుందా అని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలు అక్కడికి రావడం లేదా అని ఆయన నిలదీశారు.

సినీ హీరో మోహన్ బాబు డైలాగ్‌ చెప్పిన అమర్నాధ్.. విపక్ష నేతలపై రెచ్చిపోయారు. అడవిలో సింహం కావాలని ప్రతి కుక్కకీ ఉంటుందని.. గర్జించే సింహానికి, మొరిగే కుక్కకి చాలా వ్యత్యాసం ఉంటుందంటూ మోహన్‌బాబు డైలాగ్ చెప్పారు. ఇక్కడ సింహమెవరో.. కుక్క ఎవరో చెప్పాల్సిన అవసరం లేదంటూ ఎద్దేవా చేశారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్‌పైనా విమర్శలు గుప్పించారు. గతంలో రిలాక్సేషన్ కోసం కేఏ పాల్ వీడియోలు చూసేవాడినని.. ఈ మధ్య పీకే పాల్ వీడియో చూస్తున్నానంటూ సెటైర్లు వేశారు.

మాజీ మంత్రి నారాయణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గుడివాడ అమర్నాధ్. మాజీ మంత్రి నారాయణ కనిపించడం లేదని.. ఆయన ఎక్కడ ఉన్నారో బయటకు రావాలన్నారు. సీఆర్డీఏ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన నారాయణ కనపడకపోవడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. తన భద్రతపై నారాయణ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లేకుంటే బయటకు వచ్చి తప్పు చేశానని ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. అప్రూవర్‌గా మారితే తమ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు.
Please Read Disclaimer