ఏపీ ఎన్నికల కమిషన్ కు హైకోర్టు చీవాట్లు?

0

గడిచిన రెండు రోజులుగా ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏపీ అధికారపక్షాన్ని డిఫెన్స్ లో పడేలా చేస్తున్నాయి. సంక్రాంతి వేళ అమరావతిలో పోలీసులు నిర్వహించిన కవాతు.. విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులు అంశాలపై ఇప్పటికే ఏపీ డీజీపీకి హైకోర్టు నుంచి ఎదురైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి కావటమే కాదు.. చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించిన వైనం తెలిసిందే.

తాజాగా ఏపీ హైకోర్టు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. చీవాట్లు పెట్టటం గమనార్హం. అధికారపక్షంపై వస్తున్న ఆరోపణల విషయంలో తగిన చర్యలు తీసుకోవటం లేదన్న కీలక వ్యాఖ్యతో పాటు.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరు ఏ మాత్రం బాగోలేదన్న వైనాన్ని స్పష్టం చేసింది.

ఎన్నికల సమయంలో.. కోడ్ అమల్లో ఉన్నప్పుడే ఎన్నికల సంఘానికి అధికారాలు ఉంటాయని చెప్పిన రాష్ట్ర ఎన్నికల కమిషన్.. ఇప్పుడెందుకు సరిగా స్పందించటం లేదని ప్రశ్నించింది. అధికార పార్టీకి చెందిన నేతలు కోడ్ ఉల్లంఘనలపై ఆధారాలతో సహా కంప్లైంట్ చేసినా.. రాష్ట్ర ఎన్నికల సంఘం వారిపై తగిన చర్యలు ఎందుకు చేపట్టటం లేదని నిలదీసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి.. న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

అనంతపురం తాడిపత్రిలో.. డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా కడపలో.. ఆళ్లగడ్డలో అధికారపక్ష నేతలు చేసిన ఉల్లంఘనల్ని ఆధారాలతో సహా అందించినప్పుడు చర్యలు తీసుకునే విషయంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టింది. అనంతపురం జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోసం ఈ నెల పదిన లేఖ రాశామని.. నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లుగా లాయర్ వ్యాఖ్యానించగా.. ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

ఇప్పుడు అనంతపురం కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కాదని.. ఎన్నికల కోడ్ వచ్చాక ఈసీ నియంత్రణలో ఉంటారని.. వారి నుంచి ఇప్పటివరకూ నివేదికను ఎందుకు తెప్పించుకోలేదు? ఈ-మొయిల్ ద్వారా అయినా తెప్పించుకోవచ్చు కదా? నివేదికలు రాలేదని కాలం వెళ్లదీస్తే ఎలా? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎన్నికల నిర్వాహణ కాలాన్ని తగ్గించాల్సిన వచ్చిన వైనాన్ని తప్పు పట్టింది. ఎన్నికల నిర్వహణకు 40 రోజులు వ్యవధి కావాలని తమ ముందు చెప్పి.. ఇప్పుడెందుకంత హడావుడిగా ఎన్నికలు జరుపుతున్నారు? అని ప్రశ్నించింది. మొత్తానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉక్కిరిబిక్కిరి అయ్యేలా.. సమాధానాలు చెప్పేందుకు కిందామీదా పడేలా హైకోర్టు ప్రశ్నలు ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-