ఏపీలో గ్రామ సచివాలయాల ఏర్పాటు.. ప్రభుత్వం జారీచేసిన గైడ్‌లైన్స్ ఇవే!

0

గ్రామ సచివాలయాల ఎంపికకు సంబంధించి మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. జిల్లా పంచాయతీ అధికారులు, సీఈఓలు, ఎంపీడీఓలతో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలోనే గ్రామ సచివాలయాల ఎంపికపై మార్గదర్శకాల వివరాలను వెల్లడించారు.ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసిన పంచాయితీ రాజ్ శాఖ.. గ్రామీణ ప్రాంతాల్లో 3వేలు, గిరిజన ప్రాంతాల్లో 2వేల జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించింది. జనాభా తక్కువగా ఉంటే సమీపంలోని గ్రామాలను విలీనం చేయాలని నిర్దేశించింది. రెండు, మూడు గ్రామాలు కలిపే సమయంలో సామీప్యత, రవాణా సదుపాయం తప్పక ఉండేలా చూడాలని అందులో స్పష్టం చేసింది. అలాగే పంచాయతీ క్లస్టర్లు, ఎంపీటీసీ పరిధులను పరిశీలనలోకి తీసుకోవాలని సూచించింది. అన్నింటికీ అందుబాటులో ఉండే పెద్ద పంచాయతీని గ్రామ సచివాలయంగా ఎంపికచేయాలని పేర్కొంది. 

పంచాయితీ రాజ్ శాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం.. 3000 పైబడి జనాభా ఉండే ప్రతి పంచాయతీకి సచివాలయం ఏర్పాటుచేయాలి. ఒకవేళ తక్కువ జనాభా ఉంటే సమీప గ్రామాలను కలిపి ఒకటిగా ఏర్పాటుచేయాలి. రెండు, మూడు చిన్న పంచాయతీలను కలిపి గ్రామ సచివాలయంగా ఏర్పాటుచేయాల్సి వచ్చినప్పుడు మధ్యలో ఉండే గ్రామాన్ని కేంద్రంగా చేయాలి. వీటిలో 2వేల జనాభా ఉండే పెద్ద గ్రామాన్ని ఎంపిక చేసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో 2000 పైబడి జనాభా ఉండే అన్ని పంచాయతీలను గ్రామ సచివాలయాలుగా గుర్తించాలి. తక్కువ జనాభా ఉంటే.. రెండు, మూడు పంచాయతీలను కలిపి 2వేల జనాభాకు చేర్చి సచివాలయంగా ఏర్పాటుచేయాలని సూచించారు. 

గ్రామ వాలంటీర్ల ఎంపికలో నిబంధనల ప్రకారం వివిధ సామాజిక వర్గాలకు రిజర్వేషన్‌ వర్తింపజేయాలి. మహిళలకు 50శాతం కోటా అమలుచేయాలి. ఏదైనా ఒక సామాజికవర్గానికి చెందిన దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోతే, ఇతర కవర్గాల నుంచి ఎంపిక చేయవచ్చు. మైదాన ప్రాంతాల్లోని పంచాయతీలో ఓటర్ల ఆధారంగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు ఉన్నచోట ముందుగా ఎస్టీలకు అవకాశం ఇవ్వాలి. ఎస్టీలు తక్కువగా ఉంటే ఎస్సీలకు, తర్వాత బీసీలకు ప్రాధాన్యమివ్వాలి. 

అలాగే, కొత్తగా వివాహమైన మహిళల ఇంటి పేర్లు, నివాస ధ్రువీకరణ విషయంలో ఏర్పడ్డ గందరగోళంపై కూడా స్పష్టత ఇచ్చింది. వీరు గ్రామ వాలంటీరుగా దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థి స్థానికతను ధ్రువీకరిస్తూ వీఆర్ఓ లేదా పంచాయతీ అధికారి ఇచ్చే రెసిడెన్ష్ సర్టిఫికెట్ పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు చేసి ఉంటే ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుని అనుమతించాలి. వివాహితుల ఇంటిపేర్ల మార్పు విషయంలో పదోతరగతి, ఇతర అర్హత పత్రాలను పరిశీలించి దరఖాస్తులను స్వీకరించాలి. వీటితోపాటు గ్రామ వాలంటీర్‌ వెబ్‌సైట్‌లోనూ పంచాయతీ/ వీఆర్ఓ ఇచ్చే సర్టిఫికెట్‌లను అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ఏర్పాట్లుచేయాలని గైడ్‌లైన్స్‌లో నిర్దేశించారు. 
Please Read Disclaimer