ఏపీ పోలీసుల సంచలనం నిర్ణయం.. ఇక జీరో ఎఫ్‌ఐఆర్ అమలు

0

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ హత్యకేసుతో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇకపై జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్‌లో అయినా ఫిర్యాదు చేయొచ్చు. ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రేంజీల డీఐజీలు, జిల్లా ఎస్పీలు, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లకు మెమో జారీ చేశామని తెలిపారు.

జీరో ఎఫ్‌ఐఆర్ ఆదేశాలకు సంబంధించి వారం రోజుల్లో విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు డీజీపీ. ఎవరైనా కేసు పెట్టేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పుడు.. ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలో లేదని వెనక్కి పంపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు డీజీపీ. ఇది సరైన పద్దతి కాదని.. అందుకే జీరో ఎఫ్‌ఐఆర్ అమల్లో ఉంటే.. పోలీసు స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని పోలీసు స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయొచ్చన్నారు.

ఇక కేసుకు సంబంధించి తమ పరిధి కాదంటూ పోలీసులు బాధితుల ఫిర్యాదును తిరస్కరించడానికి జీరో ఎఫ్‌ఐఆర్‌లో అవకాశముండదు. జీరో ఎఫ్‌ఐఆర్‌తో బాధితులు ఏ పోలీసు స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేస్తే.. దానిని స్వీకరించి, విచారణ జరిపి, సంఘటనా స్థలం పరిధిలో ఉన్న స్టేషన్‌కు ఫిర్యాదును పోలీసులు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఏ పోలీసు అధికారైనా తమ పరిధి కాదని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి నిరాకరిస్తే వారిని ఐపీసీ166–ఏ ప్రకారం ప్రాసిక్యూట్‌ చేయడానికి ఆదేశిస్తారు. శాఖాపరమైన చర్యలకు సిఫార్స్ చేస్తారు.

జీరో ఎఫ్ఐఆర్‌తో పాటూ.. మహిళలు, చిన్నారులు ఆపదలో ఉన్నప్పుడు 100, 112, 181 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేయాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సూచించారు. ఈ నంబర్లను ఏకీకృతం చేస్తామని.. అప్పుడు ఏ నంబర్‌కు ఫోన్‌ చేయాలనే సందిగ్ధం ఉండదని అభిప్రాయపడ్డారు. అన్ని సేవలు ఒకే చోట పొందేలా ఒక యాప్‌ను రూపొందిస్తామని చెబుతున్నారు. మహిళల రక్షణ సవాల్‌గా మారిందని, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్యానించారు

ఇక రాష్ట్రవ్యాప్తంగా మహిళలు గ్రామ సచివాలయంలోనూ ఫిర్యాదులు ఇవ్వొచ్చని.. మహిళా సంరక్షణ కార్యదర్శులు వాటిని పోలీస్‌స్టేషన్‌కు పంపుతారని తెలిపారు. పరిపాలన వ్యవస్థను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లే గ్రామ సచివాలయ వ్యవస్థ ఒక విప్లవం అన్నారు. మహిళల భద్రత, రక్షణ, రూల్‌ ఆఫ్‌ లా, పోలీసు సమస్యలు, శాంతిభద్రతలు, మహిళా శిశు సంక్షేమ సేవలపై మహిళా సంరక్షణ కార్యదర్శులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు రెండు వారాలపాటు శిక్షణ ఇస్తామని చెప్పారు.
Please Read Disclaimer