రాజధాని తరలిస్తే మీదే బాధ్యత.. జగన్ సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

0

కౌంటర్లు దాఖలు చేయాలని సర్కార్‌కి ఆదేశాలు

సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులతో పాటూ రాజధానిపై దాఖలైన పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసెంబ్లీ, మండలి బిజినెస్‌ రూల్స్‌ను తమకు సమర్పించాలని ఏజీకి సూచించింది. రాజధానిపై ఎక్స్‌పర్ట్ కమిటీ, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, హైపవర్‌ కమిటీల నివేదికలను పిటిషనర్ల తరపు లాయర్లు ఇవ్వాలని చెప్పింది. కోర్టు విచారణలోపు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తే తమ దృష్టికి తేవొచ్చని పిటిషనర్లకు కోర్టు సూచించింది.

వాదనలు వినిపించిన ప్రభుత్వం

అంకతముందు ప్రభుత్వం తరపున లాయర్లు వాదనలు వినిపించగా.. కోర్టు కొన్ని ప్రశ్నలు సంధించింది. బిల్లుల్ని శాసనమండలికి పంపాక ఏమైందని ప్రశ్నించింది.. వాటిని శాసనమండలి ఛైర్మన్‌ సెలక్ట్ కమిటీకి పంపారని చెప్పారు.. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. బిల్లులు చట్టరూపం దాల్చలేదు కాబట్టి కొంత సమయం వేచి చూద్దామని వ్యాఖ్యానించింది. బిల్లులు చట్టం అయ్యాక పిటిషన్లు అన్నీ కలిపి విచారణ జరుదామని కోర్టు ప్రతిపాదించింది.

రైతుల అభిప్రాయాలను పట్టించుకోలేదన్న పిటిషనర్ తరపు లాయర్

ఫిబ్రవరి 26లోపు ప్రభుత్వ కార్యాలయాల తరలించకుండా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ల తరపు లాయర్ కోర్టును కోరారు. రైతుల అభ్యంతరాల్ని పట్టించుకోకుండా హైపవర్‌ కమిటీ వ్యవహరించిందని.. పిటిషన్లను విచారణకు స్వీకరించాలని కోరారు. దీన్ని తిరస్కరించిన కోర్టు.. ప్రభుత్వాన్ని కౌంటర్లు దాఖలు చేయనివ్వాలని వ్యాఖ్యానించింది.

పిటిషన్లు దాఖలు చేసిన రైతులు, వ్యాపారులు

సీఆర్‌డీఏ చట్టం రద్దు, వికేంద్రీకరణ బిల్లుపై ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో పాటూ జీఎన్‌రావు కమిటీ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేయాలని కోరుతూ రాజధాని రైతు పరిరక్షణ సమితి.. హైపవర్‌ కమిటీ ఏర్పాటును సవాలుచేస్తూ మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ కోసం సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer