విశాఖకు సీఎం వరాలు.. బాబు నియోజకవర్గానికి బంపర్ ఆఫర్, పులివెందులతోపాటు..

0

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్న వేళ.. పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, ప్రస్తుత పురోగతిని సీఎం జగన్ సమీక్షించారు. వైజాగ్‌ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా మారుస్తారని వార్తలు వెలువడుతున్న వేళ.. విశాఖపై సీఎం ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు.

నగరానికి మెట్రో రైలు ప్రాజెక్టుపై సమీక్షించిన సీఎం.. ఆర్కే బీచ్ నుంచి భీమిలీ బీచ్ వరకు ట్రామ్ తరహాలో ప్రజారవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. విశాఖకు నిరంతర తాగునీరు అందించాలని.. ఇందుకోసం పోలవరం నుంచి నగరానికి భూగర్భ పైపు లైన్ల ద్వారా నీటి సరఫరా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. విశాఖలో 1.5 లక్షల ఇళ్ల పట్టాలు అందించాలని ఆదేశించారు.

పులివెందుల, తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించారు. పులివెందుల సీఎం జగన్ సొంత నియోజకవర్గం కాగా.. తాడేపల్లిలో సీఎం నివాసం ఉంది. మంగళగిరి ప్రజలు నారా లోకేశ్‌ను ఓడించి మరీ వైఎస్సార్సీపీని గెలిపించారు. దీంతో ఈ నియోజకవర్గాలపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.

అలాగే కడప జిల్లాలోని కమలాపురంతోపాటు.. చిత్తూరు జిల్లాలోని కుప్పంలను మున్సిపాలిటీలుగా మార్చేందుకు జగన్ సర్కారు అంగీకరించింది. కుప్పం నియోజకవర్గానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.

రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో 19,769 కి.మీ. భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు భావిస్తోంది. దీనికి రూ.23,307 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. దశల వారీగా మున్సిపాలిటీల ప్రాధాన్యం ప్రకారం భూగర్భ డ్రైనేజీ, మురుగు నీటి శుద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Please Read Disclaimer