‘కోడిగుడ్ల’ కోసం కొట్టుకున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు.. ఫ్యాక్షన్ సినిమా చూపించారు!

0

విద్యార్థులకు అందజేసే మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్ల సరఫరా టెండర్ల విషయంలో తలెత్తిన వివాదం తలలు పగలుగొట్టుకునే దాకా వెళ్లిన ఘటన కర్నూలు జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. అధికార పార్టీకి చెందిన నేతలే బాహాబాహీ తలపడ్డారు. కోడిగుడ్ల సరఫరాకు టెండర్లను అధికారులు ఆరు నెలల కిందట ఈ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా ఆహ్వానించారు. ఇందుకు పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారులు టెండర్లు దాఖలు చేశారు. ఆన్‌లైన్‌లో తొమ్మిది మంది పేర్లను నమోదు చేసుకోగా వారిలో ఇద్దరు మాత్రమే అవసరమైన పత్రాలను సమర్పించారు. నిబంధనల ప్రకారం ఇద్దరు అర్హత సాధించలేదు.

ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ తలెత్తడంతో జులై 25న జరగాల్సిన టెండర్లను వాయిదా వేశారు. తాజాగా, అక్టోబరు నెల ప్రారంభంలో ఆన్‌లైన్‌ టెండర్లను ఆహ్వానించిన అధికారులు.. బిడ్డింగ్‌కు గడువు బుధవారం ఒంటి గంటతో పూర్తవుతుందని తెలిపారు. దీంతో ఇరువర్గాలూ టెండర్ దాఖలు చేయడానికి ఉదయాన్నే కర్నూలు డీఈవో ఆఫీస్‌కు చేరారు. తొలుత యునైటెడ్‌ ఏజెన్సీ నెల్లూరుకు చెందిన శ్రీధర్‌‌బాబు, తరువాత మారుతీ ఆగ్రోస్‌ ఏజెన్సీ, కడపకు చెందిన శివతేజ వర్గీయులు టెండర్‌ పత్రాలు దాఖలు చేశారు.

అనంతరం ఓ వ్యక్తి టెండర్‌ దాఖలుచేసి అధికారులకు వివరాలను చెబుతుండగా వైఎస్ఆర్‌సీపీకి చెందిన కొందరు అడ్డుకుని అతడ్ని దౌర్జన్యంగా బయటకు వెళ్లగొట్టారు. చివరగా డోన్‌, నందికొట్కూరుకు చెందిన వైఎస్ఆర్‌సీపీ వర్గీయులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు.

కలెక్టరేట్ పార్కింగ్‌ ప్రదేశంలో ఉన్న డోన్‌ ముఖ్యనేత అనుచరులను నందికొట్కూరుకు చెందిన వైఎస్ఆర్‌సీపీ వర్గీయులు వెంబడించి రాళ్లు, రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో డోన్‌కు చెందిన మక్బుల్‌ బాష, రఘవీర్‌ గౌడ్‌, రాజు, దినేష్‌ గౌడ్‌ గాయపడ్డారు. ఈ దాడి ఓ ప్లాన్ ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. డోన్‌కు చెందిన ముఖ్యనేత అనుచరులు రెండు వాహనాల్లో 12 మంది వచ్చారు. నందికొట్కూరు నేతలు మాత్రం పథకం ప్రకారం 100 మందికి పైగా ఉదయం 9 గంటలకే మారణాయుధాలతో కలెక్టరేట్‌కు చేరుకొని విడివిడిగా తలోచోటా కాపుకాశారు.

గొడవ జరిగితే ప్రత్యర్థులు తప్పించుకునే వీళ్లేకుండా వ్యూహం పన్నారు. ఆ ప్రకారమే డోన్‌ నేత వర్గీయులపై రాడ్లు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు. పరిగెత్తిన వారిని వెంటబడి మరీ రాళ్లతో కొట్టారు. మరోవైపు, పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులు, మీడియాపైనా కూడా దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల సెల్‌ఫోన్లను లాక్కుని బెదిరింపులకు పాల్పడ్డారు. ఘర్షణపై పోలీసులు కేసు నమోదుచేశారు.
Please Read Disclaimer