అరుణ్‌జైట్లీ కన్నుమూత

0

భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ (66) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం 12.07 గంటలకు కన్నుమూశారు. కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో తుదిశ్వాసవిడిచారు. 2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.

ఈ ఏడాది కేంద్రంలో మళ్లీ భాజపా విజయ ఢంకా మోగించినా, ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలో ఆయన చేరలేదు. అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్న అనంతరం ఆయన కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు నిరాకరించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే ఇంటికే పరిమితమయ్యారు. అయితే, ఇటీవల జైట్లీ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఈ నెల 9న హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాసవిడిచారు. ఈ నెల 10నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటెన్‌ విడుదల చేయని వైద్యులు ఈ రోజు మధ్యాహ్నం ఆయన మృతిచెందినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు. అరుణ్‌ జైట్లీకి భార్య సంగీత, కుమార్తె సొనాలి జైట్లీభక్షి, కుమారుడు రోహన్‌ జైట్లీ ఉన్నారు.

దిల్లీలో విద్యాభ్యాసం

అరుణ్‌జైట్లీ విద్యాభ్యాసం 1960-1969 మధ్య సెయింట్‌ జేవియర్స్‌ పాఠశాల (దిల్లీ)లో సాగింది. 1973లో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 1974లో విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1977లో దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. ఇదే సమయంలో ఏబీవీపీ ఉద్యమకారుడిగా పనిచేశారు. 1982 మే 24న సంగీత డోగ్రీని పెళ్లి చేసుకున్నారు. కుమారుడు రోహన్‌, కుమార్తె సోనాలి అంటే ఆయనకు ఎంతో ఇష్టం.

న్యాయవాదిగా.. రాజకీయ వేత్తగా..

న్యాయ విద్య పూర్తయ్యాక 1977 నుంచి జైట్లీ సుప్రీంకోర్టు, కొన్ని హైకోర్టుల్లో లా ప్రాక్టీస్‌ చేశారు. 1989లో అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా ఎంపికయ్యారు. 1990లో దిల్లీ హైకోర్టులో సీనియర్‌ అడ్వకేట్‌ హోదా లభించింది. 1991 నుంచి భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. 1998లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు భారత ప్రతినిధిగా వెళ్లారు. 1999 అక్టోబరు 13న వాజ్‌పేయీ ప్రభుత్వంలో సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రిగా (స్వతంత్ర హోదా) పనిచేశారు. 2000 జులై 23న సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అదే ఏడాది నవంబరులో జైట్లీకి కేబినెట్‌ హోదా దక్కింది. 2009 జూన్‌ 3న రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. దిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా, బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.

రాజ్యసభకు ఎంపికై..

నరేంద్ర మోదీ హవా కొనసాగినప్పటికీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో జైట్లీ లోక్‌సభకు పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయితే అదే ఏడాది మేలో రాజ్యసభకు ఎంపికయ్యారు. మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ బాధ్యతలు చేపట్టారు.




Please Read Disclaimer